10 July, 2026 | 2:54 AM

దరఖాస్తు గడువు ముగియకముందే బీ కేటగిరి ఇంజనీరింగ్ సీట్ల అమ్మకాలు

10-07-2026 01:13 AM
  1. అక్రమాలకు పాల్పడిన ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి
  2. పీడీఎస్‌యూ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయ్ కన్నా, రాష్ట్ర సహాయ కార్యదర్శి గణేష్ డిమాండ్

ముషీరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు 202627 విద్యా సంవత్సరానికి సంబంధించి బి-కేటగిరి సీట్ల భర్తీలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి జారీ చేసిన నిబంధనలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నాయని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్  జాతీయ ప్రధాన కార్యదర్శి ఇ. విజయ్ కన్నా, రాష్ట్ర సహాయ కార్యదర్శి కే. గణేష్ లు ఆరోపించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణా రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేసినట్లు వారు వెల్లడించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాకముందే, ఎలాంటి బహిరంగ నోటిఫికేషన్ లేకుండా కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు లక్షల రూపాయలకు బి-కేటగిరి సీట్లను అమ్ముకున్నాయని, ఇది విద్యార్థుల భవిష్యత్తుతో వ్యాపారం చేయడమేనని మండిపడ్డారు. మొత్తం ఇంజనీరింగ్ సీట్లలో 30 శాతం బి-కేటగిరి సీట్లను దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మెరిట్ ఆధారంగా పారదర్శకంగా భర్తీ చేయాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా డొనేషన్లు, భారీ ఫీజుల పేరుతో విద్యార్థులు, 

తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేయడం దారుణమని అన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ అథారిటీ (టిఏఎఫ్ ఆర్సీ) తక్షణమే స్పందించి బి-కేటగిరి అడ్మిషన్లపై సమగ్ర విచారణ చేపట్టాలని, అక్రమాలకు పాల్పడిన కళాశాలలపై కఠిన చర్యలు తీసుకుని వాటి గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల సీట్ల వ్యాపారాన్ని అడ్డుకుని, పేద,  మధ్యతరగతి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం  సంబంధిత అధికారులు నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో  పిడిఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. పవన్ కుమార్,  రాష్ట్ర నాయకులు ఎంబి. వంశీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.