1 May, 2026 | 3:32 AM

క్యాన్లలో ఇంధన విక్రయం నిషేధం..

01-05-2026 02:10 AM

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): గురువారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా పరిస్థితులపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెట్రోల్ బంకుల్లో ఇండెంట్ విధానం, ఇంధన విక్రయాల వంటి అంశాలపై సమగ్రంగా చర్చించి, పలు సూచనలు చేశారు.

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో  ఇంధన కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆయిల్ కంపెనీల ద్వారా నిరంతరం సరఫరా జరుగుతోందని, బంకుల వద్ద నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని తెలిపారు. పెట్రోల్, డీజిల్ సరఫరాలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలని, కూపన్ల వినియోగాన్ని అమలు చేయాలని, ముఖ్యంగా రైతులకు అందించే 25 లీటర్ల ఇంధన పరిమితి (కల్టివేటర్లు & హార్వెస్టర్లకు) విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని తెలిపారు. స్టాక్ వివరాలు, రికార్డులు సరైన విధంగా నిర్వహించాలని, అన్ని పెట్రోల్ బంకులు నిబంధనలు  ఖచ్చితంగా పాటించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

జిల్లాలో ఇంధన సరఫరా వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా పౌరులకు విజ్ఞప్తి చేస్తూ.. అవసరమైన మేరకు మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని, అనవసరంగా నిల్వ చేయకుండా సహకరించాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీఓలు గోపీరాం, వెంకన్న, డీఏఓ అంబికా సోనీ, విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, డీఎం సీఎస్ హాథీరామ్, ఆర్టీఓ శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్, తూనికలు, కొలతల శాఖ అధికారి ఝాన్సీ, ఇతర సంబంధిత అధికారులు, పెట్రోలియం డిస్ట్రిబ్యూటర్లు, తదితరులు పాల్గొన్నారు.