గీతాంజలి పాఠశాలలో అక్రమ పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, షూస్, టై, బెల్ట్ అమ్మకాలను వెంటనే నిలిపివేయాలి: పిడిఎస్‌యూ
జిల్లా విద్యాశాఖ అధికారి స్పందించి అక్రమ ఫీజుల వసూళ్లను నియంత్రించాలి
- స్టోర్ రూమ్ కు తాళం వేసిన ఎంఈఓ
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం పట్టణ కేంద్రంలోని గీతాంజలి పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపుతూ, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, షూస్, టై, బెల్ట్ తదితర వస్తువులను పాఠశాల ద్వారానే కొనుగోలు చేయాలని ఒత్తిడి చేయడాన్ని నిరసిస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యూ), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నేడు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పిడిఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృధ్వీ, జిల్లా అధ్యక్షుడు బుర్ర వీరభద్రం, జిల్లా కార్యదర్శి మునిగల శివ ప్రశాంత్ మాట్లాడుతూ... విద్యను వ్యాపారంగా మార్చి తల్లిదండ్రులను దోపిడీ చేయడం సరికాదని అన్నారు. గీతాంజలి పాఠశాల యాజమాన్యం అక్రమ ఫీజు వసూళ్లను నియంత్రించాలని కోరారు. ఏడవ తరగతి విద్యార్థికి 95 వేల రూపాయల ఫీజు, పాఠ్యపుస్తకాలకు 15వేల రూపాయలు వసూళ్లు చేయడం ఏంటని ప్రశ్నించారు. కేం బ్రిడ్జి కరిక్యులం పేరుతో పేద విద్యార్థులను మోసగించడం హేయమైన చర్య అన్నారు.
ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నెం. 91 ప్రకారం పాఠశాలలు విద్యార్థులను ఒక నిర్దిష్ట దుకాణం నుంచి పుస్తకాలు, యూనిఫాంలు, షూస్, టై, బెల్ట్ కొనుగోలు చేయాలని బలవంతం చేయరాదని స్పష్టం చేసినప్పటికీ, అనేక ప్రైవేట్ పాఠశాలలు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమ విక్రయాలు కొనసాగిస్తున్నాయని విమర్శించారు. ప్రస్తుతం ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులతో పాటు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పేరుతో వేలాది రూపాయల అదనపు భారం తల్లిదండ్రులపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యను హక్కుగా చూడాల్సిన ప్రభుత్వం, ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గీతాంజలి పాఠశాలలో జరుగుతున్న అక్రమ పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, షూస్, టై, బెల్ట్ అమ్మకాలను వెంటనే నిలిపివేయాలనీ, జి.ఓ. నెం. 91ను కచ్చితంగా అమలు చేయాలనీ, ప్రైవేట్ పాఠశాలల అక్రమ వసూళ్లపై జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలనీ, విద్యార్థులు, తల్లిదండ్రులను బలవంతపు కొనుగోళ్లకు గురిచేసే యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనీ, విద్యాహక్కు చట్టాన్ని (RTE) పకడ్బందీగా అమలు చేయాలనీ, ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే జిల్లావ్యాప్తంగా పిడిఎస్‌యూ ఆధ్వర్యంలో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు రామ్ చరణ్ పాల్గొన్నారు.






