29 June, 2026 | 9:51 PM

నకిలీ విత్తనాలు, పురుగుమందులను అరికట్టాలి

29-06-2026 09:09 PM

- రైతు భరోసా వెంటనే చెల్లించాలి

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుమందుల విక్రయాలను అరికట్టాలని, యూరియా సహా ఎరువులను యాప్ విధానం లేకుండా నేరుగా రైతులకు అందించాలని, రైతు భరోసా నగదును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలి సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యంలో సోమవారం ఇల్లందులో ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి వినతిపత్రం సమర్పించారు.

న్యూడెమోక్రసీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు రైతులు ర్యాలీగా చేరుకుని నిర్వహించిన సభలో రాష్ట్ర నాయకుడు తుపాకుల నాగేశ్వరరావు, మండల కార్యదర్శి యాదలపల్లి సత్యం, ఏఐకేఎంఎస్ మండల కార్యదర్శి మూడు మాలు మాట్లాడుతూ రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సకాలంలో అందించాలని,

యూరియా యాప్‌ను రద్దు చేసి ఎరువులను నేరుగా విక్రయించాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న పోడు భూములకు పట్టాలు మంజూరు చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు విధానాన్ని రద్దు చేయాలని, రైతు భరోసా, మొక్కజొన్న కొనుగోలు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.