2 March, 2026 | 9:13 AM

మూడు మండలాలకు ఒకే ఏవో!

02-03-2026 12:51 AM

ఇంచార్జ్ పాలనలో అన్నదాతలు ఆగం

పెంచికల్పేట్, మార్చి1 (విజయక్రాంతి): అన్నదాతలకు సాగులో సకాలంలో సూచనలు సలహాలు అంత వేసేందుకు ప్రభుత్వం ప్రతి మండలానికి ఒక మండల వ్యవసాయ శాఖ అధికారిని కేటాయించింది. కానీ ఆ మూడు మండలాలకు మాత్రం ఒక్కడే మండల అగ్రికల్చర్ అధికారి ఉండడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా లోని దహే గాం, పెంచికల్పేట్ మండలానికి కాగజ్‌నగర్ మండల వ్యవసాయ శాఖ అధికారి ఇన్చార్జిగా వ్యవహరిస్తు న్నారు. సదరు అధికారి 3 మండలాలలో విధులు నిర్వహిస్తుండడంతో ఆయన ఆడిందే ఆట పాడిన పాటగా నడుస్తుంది.

రైతులకు సాగు సలహాలు పంట ప్రణాళిక విత్తనా లు ఎరువుల తనిఖీలు నకిలీ మందులను నియంత్రణ, రైతుబంధు, బీమా పథకాల పర్యవేక్షణ కరువైందని ఆరోపణలు వెలువెత్తుతు న్నాయి.ఇన్చార్జి వ్యవస్థతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎరువులు పక్క దారి పట్టాయన ఆరోపణలు లేకపోలేదు. పెంచికల్పేట్ మండలంలో 17వేల ఎకరాలు సాగు అవుతుండగా 9000 ఎకరాల పత్తి 4000 ఎకరాలలో వరి, మొక్కజొన్న, కంది, మిర్చి, పంటలను రైతులు సాగు చేస్తుంటారు.

తంలో ఇక్కడ విధులు నిర్వహించిన ఏవో అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో జిల్లా కార్యాలయానికి డిప్యూటేషన్ వేయడంతో రెండేళ్లుగా ఇంచార్జ్ పాలన కొనసాగుతుంది. దాహేగాం మండలంలో వ్యవసా యానికి అత్యధిక ప్రాధాన్యత నెలకొంది. రెండు సంవత్సరాలుగా రెగ్యులర్ అధికారి లేకపోవడంతో దాదాపు 36వేల ఎకరాలలో సాగు చేస్తున్న రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీనికి తోడు పలు క్లస్టర్ల ఏఈవోలు లేకపోవడంతో క్షేత్రస్థాయిలోను అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం: మనోహర్, ఏడిఏ, కాగజ్‌నగర్

డివిజన్లో రెండు మండలాల్లో ఏవోలు లేకపోవడం  కారణంగా తాత్కాలికంగా ఇన్చార్జిని కేటాయించి రైతులకు సేవలు అందిస్తున్నాం. రైతులకు ఇబ్బంది కలగకుండా ఫీల్ స్థాయిలో ఏఈఓలు, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు.పెంచికల్పేట్, దాహేగాం మండలాల్లో రెగ్యులర్ ఏవోలు లేకపోవడంతో కాగజ్‌నగర్ ఏవోకు అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. రెగ్యులర్ ఏవోను కేటాయించాలని అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.

రెగ్యులర్ అధికారిని నియమించాలి

మండల వ్యవసాయ శాఖ అధికారి లేకపోవడంతో ’పనుల నిమిత్తం కార్యాలయం వస్తే తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.ప్రతి సంవత్సరం ఎరువుల పంపిణీ విషయంలో తీవ్రంగా నష్టపోతున్నాం.మండలానికి వచ్చే ఎరువులు పక్కదారి పడుతున్నాయి.పర్యవేక్షణ లేకపోవడంతో మాలాంటి రైతులకు నష్టం కలుగుతుంది.ప్రైవేటు డీలర్లను ఆశ్రయించి అధిక ధరలకు ఎరువులు కొనాల్సిన దుస్థితి నెలకొంది.

 వెంకటేష్, సర్పంచ్, మురళిగుడా