తస్మాత్ జాగ్రత్త.. సమోసా, పఫ్స్ ప్రియులకు షాకింగ్ సీన్
ప్రముఖ హోటళ్లకు సమోసాలు, కుళ్లిన గుడ్లతో పఫ్స్ సరఫరా
నాసిరకం పదార్థాలను స్వాధీనం
నిందితుడు అబ్దుల్ అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు.
హైదరాబాద్: టాస్క్ ఫోర్స్‌కు చెందిన హైదరాబాద్ ఆహార కల్తీ నిఘా బృందం (H-FAST), కుల్సుంపురా పోలీసులతో సమన్వయంతో జియాగూడలో అక్రమంగా నడుస్తున్న ఒక ఆహార తయారీ కేంద్రాన్ని తనిఖీ చేసింది. దాడుల సమయంలో, ఆ యూనిట్ ఎటువంటి చెల్లుబాటు అయ్యే FSSAI లైసెన్స్, వ్యాపార లైసెన్స్ లేదా అగ్నిమాపక భద్రతా అనుమతి లేకుండా, అత్యంత అపరిశుభ్రమైన పరిస్థితులలో భారీ ఎత్తున సమోసాలను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
నిందితుడు అబ్దుల్ రషీద్ పాడైపోయిన, నాసిరకమైన పదార్థాలు, ఉడికించిన గుడ్లు, పదేపదే వాడిన వంట నూనె వంటివాటిని ఉపయోగిస్తూ ప్రజారోగ్యానికి ప్రమాదం కలిగిస్తున్నట్లు తేలింది. సమోసాల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలతో పాటు, 500 పాడైపోయిన ఉడికించిన గుడ్లు, 5 కిలోల తిరిగి వాడిన వంట నూనె, 350 గుడ్డు సమోసాలు, 600 స్వీట్ కార్న్ సమోసాలు, 1000 ఉల్లి సమోసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కేసు నమోదు చేసుకున్న అధికారులు చట్టపరమైన చర్యలు ప్రారంభించామన్నారు. తదుపరి దర్యాప్తు కుల్సుంపురా పోలీస్ స్టేషన్‌లో కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఆహార కల్తీ, అక్రమ ఆహార తయారీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోలీసులు, H-FAST తమ పోరాటాన్ని కొనసాగిస్తాయని టాస్క్ ఫోర్స్ ఉప పోలీస్ కమిషనర్ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. ఇటువంటి చట్టవిరుద్ధమైన పద్ధతులను అధికారిక మార్గాల ద్వారా తెలియజేసి, ప్రజారోగ్యం, భద్రత పరిరక్షణకు సహకరించాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు.




