20-01-2026 12:31:36 AM
తాండూరు, జనవరి 19 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బి వి జి ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ ఆ పార్టీకి రేపో . . మాపో రాజీనామా చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గెలుపు కోసం ఆయన రాత్రింబవళ్లు తీవ్రంగా కృషి చేశారు. అప్పట్లో మనోహర్ రెడ్డి బ్యానర్లపై, ఫ్లెక్సీల పై, కరపత్రాలపై డాక్టర్ సంపత్ కుమార్ ఫోటోలను వేయించి ఊరూరా ..ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అయితే ఎమ్మెల్యేగా మనోహర్ రెడ్డి గెలిచిన అనంతరం పార్టీ వ్యవహారాల్లో ఒంటెద్దు పోకడలను సహించక డాక్టర్ సంపత్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తుంది.
పట్టణంలో సామాన్య ప్రజలతో పాటు అన్ని వర్గాల ప్రజలతో డాక్టర్ సంపత్ కుమార్ కు వ్యక్తిగతంగా సత్సంబంధాలు కలిగి ఉన్నారు. బి వి జి ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు ఆర్థిక సహాయం అందించి నియోజకవర్గ ప్రజల మన్ననలను పొందారు. అంతేకాకుండా ఓ పర్యాయం ఆయన సతీమణి సునీత సంపత్ కు మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఎన్నిక చేయడంలో మెజారిటీ లేకున్నా కూడా పక్కా వ్యూహంతో ప్రత్యర్థుల కళ్ళు బైర్లు కమ్మేలా మున్సిపల్ పీఠాన్ని కైవాసం చేసుకున్నారు.మున్సిపల్ ఎన్నికలవేళ ఆయన పార్టీకి రాజీనామా చేస్తే గనుక కాంగ్రెస్‌కి బీటలు పడటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.