calender_icon.png 2 February, 2026 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంపూర్ణత అభియాన్ 2.0 లక్ష్యాలను సాధించాలి

02-02-2026 05:41:48 PM

జిల్లా కలెక్టర్ కె. హరిత

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో సంపూర్ణత అభియాన్ 2.0 నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్ తో కలిసి నీతి అయోగ్ లో భాగంగా సంపూర్ణత అభియాన్ 2.0 క్రింద ఆకాంక్షిత బ్లాక్, జిల్లా కార్యక్రమాలలో నిర్దేశించిన లక్ష్యాల సాధనపై జిల్లా, మండల స్థాయి శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్య, పంచాయతీ కార్యదర్శులు, ఆశ, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బందితో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆకాంక్షిత బ్లాక్, ఆకాంక్షిత జిల్లా కార్యక్రమంలో భాగంగా జనవరి 28వ తేదీ నుండి ఏప్రిల్ 14వ తేదీ వరకు నిర్దేశిత లక్ష్యాల సాధనపై సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఆకాంక్షిత తిర్యాణి బ్లాక్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 6 నెలల నుండి 6 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు అదనపు పౌష్టికాహారం అందించాలని, అంగన్వాడీలలోని పిల్లల ఎత్తు, బరువు, కొలతలు క్రమం తప్పకుండా నమోదు చేయాలని తెలిపారు.

ప్రతి అంగన్వాడీ కేంద్రంలో మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టాలని, త్రాగునీటి సదుపాయం ఉండాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలలో  బాలికలకు ప్రత్యేక మూత్రశాలల నిర్మాణం చేపట్టాలని తెలిపారు. పశువులకు పాదం, నోటి వ్యాధులపై టీకాలు వేయాలని తెలిపారు. ఆకాంక్షిత్ జిల్లా కార్యక్రమంలో భాగంగా పుట్టిన శిశువుల బరువులు నమోదు చేయాలని, క్షయ వ్యాధి, రక్తపోటు, మధుమేహం వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి చికిత్స అందించాలని, బాలింతలు, గర్భిణులకు క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించి పోషకాహారం అందించాలని తెలిపారు.

పాఠశాలలు, అంగన్వాడీలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామాల సర్పంచ్ లను కార్యక్రమాలలో భాగస్వామ్యులను చేయాలని తెలిపారు. సంపూర్ణత అభియాన్ 1.0 లో సాధించిన అవార్డుల స్పూర్తితో ఈసారి మరింత విశ్వాసంతో జాతీయ అవార్డుల సాధనకు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. అనంతరం సంపూర్ణత అభియాన్ 2.0 లోని అంశాలపై అందించే ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.