02-02-2026 05:37:55 PM
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె హరిత
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా స్పష్టంగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హరిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావులతో కలిసి జిల్లాలోని సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల పరిధిలోని తహసిల్దార్, బూత్ స్థాయి అధికారులతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఓటరు జాబితాపై ప్రత్యేక సమగ్ర సవరణ మ్యాపింగ్ ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. 2002 సంవత్సరం ఓటరు జాబితాలో పేరు ఉంది. 2025 ఓటరు జాబితా అదే పేరు ఉండి వారి కుటుంబ సభ్యులు, కూతుర్లు, కుమారుల పేర్లు 2025 జాబితాలో ఉంటే మ్యాపింగ్ చేయాలని తెలిపారు. బూత్ స్థాయి అధికారులు తమ పోలింగ్ కేంద్రం పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించాలని, బి. ఎల్. ఓ. సూపర్ వైజర్లు, తహసిల్దార్లు పర్యవేక్షించాలని, సమగ్ర సవరణపై అవగాహన కల్పించాలని తెలిపారు.
ఫారం 6, 7, 8 దరఖాస్తులను పెండింగ్ లేకుండా చూడాలని తెలిపారు. మండలాల వారిగా సమీక్ష నిర్వహించారు.అనంతరం తహసిల్దార్లతో భూ భారతి, రెవెన్యూ సదస్సులు, సాదాబైనమాలను సమీక్షించారు. భూ భారతిలో పట్టా మార్పిడి, విరాసత్ కొరకు వచ్చే దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని తెలిపారు. గత రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో వెళ్ళి రికార్డులు పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు. సాదాబైనమా క్రింద వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారించాలని, భూ భారతి, రెవెన్యూ సదస్సులు, సాదాబైనమాల దరఖాస్తులలో పురోగతి సాధించాలని తెలిపారు. వివిధ ధ్రువపత్రాల కొరకు వచ్చిన దరఖాస్తులను నిబంధనలకు లోబడి నిర్ణీత గడువులోగా పరిష్కరించి జారీ చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.