శతక్కొట్టిన సంజూ
- చెన్నైకి తొలి విజయం
- చెపాక్‌లో సీఎస్కే ఆల్‌రౌండ్ షో
- ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో ఓటమి
* సంజూ శాంసన్ బ్యాట్ గర్జించింది. వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటూ ఒత్తిడిలో ఉన్న సంజూ చెపాక్ లో చితక్కొట్టాడు. అది కూడా మామూలుగా కాదు సెంచరీతో చెలరేగిపోయాడు. ఫలితంగా భారీస్కోరు చేసిన సీఎస్కేకు ఢిల్లీ కూడా గట్టిపోటీనే ఇచ్చింది.అయితే కీలక సమయాల్లో వికెట్లు తీసిన చెన్నై బౌలర్లు తొలి విజయాన్ని అందించారు.
చెన్నై, ఏప్రిల్ 11 : ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోవడం చెన్నైకి మేలు చేసింది. ఓపెనర్లు సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించారు. రుతురాజ్ నిరాశపరిచినా శాంసన్ మాత్రం దుమ్మురేపాడు. వరుస వైఫల్యాల తర్వాత తనలోని అసలైన ఆటను బయటకు తీశాడు. 26 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన అతడు.. సరిగ్గా మరో 26 బంతుల్లో మరో హాఫ్ సెంచరీ కొట్టి శతకం పూర్తి చేసుకున్నాడు.
ఐపీఎల్లో సంజూ ఫాస్టెస్ట్ సెంచరీ ఇదే.52 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకొని ఈ సీజన్‌లో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో పలు రికార్డులు నెలకొల్పాడు. ఐపీఎల్లో సంజూ శాంసన్కు ఇది నాలుగో సెంచరీ. అతను చివరిసారిగా 2021లో సెంచరీ బాదాడు. ఐపీఎల్ 2017లో రైజింగ్ పుణేపై ఢిల్లీ డేర్డేవిల్స్ తరఫున తొలి శతకం బాదిన సంజూ.. 2019లో సన్‌రైజర్స్‌పై రెండో సెంచరీ, 2021లో పంజాబ్ పై మూడో శతకాన్ని నమోదు చేశాడు.
తాజా సెంచరీతో మొత్తం నాలుగు శతకాలను ఖాతాలో వేసుకున్నాడు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సెంచరీ బాదిన తొలి వికెట్ కీపర్గా నిలిచాడు. మహేంద్ర సింగ్ ధోనీకి సాధ్యం కానీ ఈ రికార్డును సంజూ శాంసన్ అందుకున్నాడు. అంతేకాకుండా మూడు వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున సెంచరీ బాదిన తొలి ప్లేయర్గా సంజూ శాంసన్ చరిత్రకెక్కాడు. అతను ఢిల్లీ డేర్ డేవిల్స్, రాజస్థాన్ రాయల్స్, సీఎస్కే తరఫున శతకాలు నమోదు చేశాడు.
సంజూ విధ్వంసంతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 రన్స్ చేసింది. సంజూ శాంసన్ 56 బంతుల్లో 115 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఆయుశ్ మాత్రే 36 బంతుల్లో 59 రన్స్ చేసి రిటైర్ట్ ఔట్ అయ్యాడు. ఛేజింగ్‌లో ఢిల్లీ కూడా దూకుడుగానే ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. నిస్సాంక, కెఎల్ రాహుల్ తొలి వికెట్‌కు 5 ఓవర్లలోనే 61 పరుగులు జోడించారు. అయితే చెన్నై బౌలర్లు వరుస వికెట్లు తీసి పైచేయి సాధించారు.
రాహుల్ (18) పరుగులకు ఔటైన తర్వాత సమీర్ రిజ్వీ (6), అక్షర్ పటేల్ (1), డేవిడ్ మిల్లర్ (17) పరుగులకు వెనుదిరిగారు. ఈ దశలో స్టబ్స్ , అశుతోశ్ శర్మ పోరాడారు. వీరిద్దరూ దూకుడుగా ఆడడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. అశుతోశ్ ఔటైనా స్టబ్స్ హాఫ్ సెంచరీతో పోరాడాడు. అయితే కీలక సమయంలో అతను ఔటవడంతో ఢిల్లీ ఓటమి ఖాయమైంది. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ 189 పరుగులకు ఆలౌటైంది. ఓవర్టన్ 4 వికెట్లతో ఢిల్లీని దెబ్బకొట్టాడు.
స్కోరు బోర్డు
చెన్నై సూపర్‌కింగ్స్: 212/2 ( సంజూ శాంసన్ 115, ఆయుశ్ మాత్రే 59, దూబే 20 ; అక్షర్ పటేల్ 1/39 )
ఢిల్లీ క్యాపిటల్స్: 189 ( స్టబ్స్ 60, నిస్సాంక 41, అశుతోష్ శర్మ 19 ; ఓవర్టన్ 4/18, అన్షుల్ కాంబోజ్3/35)




