calender_icon.png 11 January, 2026 | 2:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీలో హెచ్చరికలు.. క్షేత్రస్థాయిలో దోపిడీలు!

11-01-2026 12:17:27 AM

సినిమా అంటే తెలుగు వారికి ఒక ఎమోషన్. ఆ ఎమోషన్‌ను క్యాష్ చేసుకునే క్రమంలో టిక్కెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సినిమా ఇప్పుడు కేవలం వినో దం మాత్రమే కాదు, అదొక ఖరీదైన వ్యసనంగా మారిపోయింది. ఒకప్పుడు సామాన్యుడికి అతితక్కువ ఖర్చుతో దొరికే ఏకైక ఉపశమనం సినిమా. కానీ నేడు, థియేటర్ మెట్లెక్కాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటేనే సినిమాల జాతర. అయితే ఈసారి పండక్కి వినోదం సామాన్యుడికి మరింత భారం కానుంది. తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో ఈ సమస్య తీవ్రరూపం దాల్చింది. గతంలో టిక్కెట్ల ధరల పెంపును, బెనిఫిట్ షోలను అడ్డుకుంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ఇటీవల డివిజన్ బెంచ్ స్టే విధించింది. ప్రభుత్వాలు కూడా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో సంక్రాంతి బరిలో ఉన్న ‘రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ వంటి చిత్రాల టిక్కెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోలకు మార్గం సుగమమైంది. 

 ఈ బెనిఫిట్ షోల నిర్వహణ, టిక్కెట్ల ధరల వివా దానికి ఏడాది క్రితం హైదరాబాద్‌లోని ప్రముఖ సంధ్య థియేటర్ జరిగిన తొక్కిసలా ఘటన నిదర్శనంగా నిలిచింది. ఈ సమస్య కేవలం సినిమా పరిశ్రమకే పరిమితం కాలేదు. దీని తీవ్రత ప్రభుత్వాన్ని కూడా కదిలించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ఈ అంశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తమ ప్రయోజనాల కోసం సినిమా టిక్కెట్ల రేట్లు పెంచి ప్రేక్షకులను దోచుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. ముఖ్యంగా టిక్కెట్ల పెంపు, బెని ఫిట్ షోల పేరిట జరుగుతున్న దోపిడీపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పిన మాటలు ఒక ఆశాజనక మార్పు గా కనిపించాయి. అయితే, క్షత్రస్థాయిలో పరిస్థితి మాత్రం ఇంకా అలాగే ఉంది. ప్రభుత్వం గతంలో రేట్లు పెంచవద్దని అసెంబ్లీ సాక్షగా హెచ్చరించినా, తాజాగా సంక్రాంతి సినిమాలకు ఇచ్చిన ధరల పెంపు ఉత్తర్వులు ప్రభుత్వ ద్వంద్వవైఖరికి నిదర్శనం! 

ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు పొంది రేట్లు పెంచుతున్న క్రమంలో, అది కేవలం బడా నిర్మాతలకే లాభం చేకూరుస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సగటు అభిమాని పైరసీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల ఉచితంగా సినిమాలు అందించే ఓ ప్లాట్‌ఫాం అడ్మినిస్ట్రేటర్ అరెస్ట్ అయినప్పుడు, సోషల్ మీడియాలో నెటిజన్లు అతనికి మద్దతు తెలపడం చర్చనీయాంశమైంది. చట్టపరంగా పైరసీ తప్పు అయినప్పటికీ, అధిక ధరలు సామాన్యుడిని ఆ వైపు నెడుతున్నాయనేది నగ్నసత్యం. ఇది ఒక రకంగా సినిమా పరిశ్రమకు, ప్రభుత్వాలకు చెంపపెట్టు. ప్రేక్షకుడు పైరసీని ప్రేమిస్తున్నాడంటే, దానర్థం సినిమా పరిశ్రమ సామాన్యుడికి దూరం అవుతోందనే కదా?!

సినిమా బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల సమస్యకు తక్షణమే ఒక శాశ్వత పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది. పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ప్రభుత్వం జీవోలు ఇచ్చి రేట్లు పెంచడానికి సహకరించడం కాకుండా, కనీస ధరలను నియంత్రించాల్సిన బాధ్యత తీసుకోవాలి. అప్పుడే సినిమా పరిశ్రమ మనుగడ సాగుతుంది, ప్రేక్షకుల ఆదరణ నిలబడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, పరిశ్రమ కలిసి కూర్చుని అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటారని ఆశిద్దాం. 

 దిడ్డి శ్రీకాంత్ (8686865759)