నేటి నుంచి సరస్వతి పుష్కరాలు
గొట్టిముక్కుల బ్రహ్మచారి :
2013లో జరిగిన పుష్కరాలకు 20 లక్షల మంది భక్తులు పుణ్యస్నాణమాచరించారని అధికారులు చెప్తున్నారు. ఈ సారి గతంలో కంటే రెట్టింపు భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ప్రతి రోజూ సుమారు 2 లక్షల మంది వరకు భక్తులు పుణ్యస్నానమాచరిస్తారని అంచనా. పుష్కరాలకు తెలంగాణ, మహారాష్ట్ర, ఏపీ నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఈసారి సుమారు 50 లక్షల మంది భక్తులు పుష్కర స్నానమాచరించేందుకు తరలివస్తారని ఓ అంచనా.
త్రివేణీ సంగమం.. త్రిలింగ క్షేత్రం.. త్రిదైవ క్షేత్రంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మం డలం కాళేశ్వర ముక్తీశ్వరాలయం భాసిల్లుతున్నది. నేపాల్ పశుపాద స్వామి, కాశీ విశ్వేశ్వర ఆలయాల సరసన నిలువదగిన చరిత ముక్తీశ్వర ఆలయానది. దక్షిణ కాశీగా పేర్గాంచిన ఈ పుణ్యక్షేత్రం సరస్వతీ పుష్కరాలకు సిద్ధమైంది. 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ ఘనంగా పుష్కరాలు జరుగుతాయి.
దీనిలో భాగంగా నేటి (15వ తేదీన) నుంచి పుష్కరాలకు అంకురార్పణ జరుగనున్నది. ఈనెల 26 వరకు పుష్కరాలు కొనసాగుతాయి. తొలిరోజు సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వర ప్రధానఘాట్ వద్ద సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాతి నుంచి భక్తులు గోదా వరి, ప్రాణహిత, సరస్వతి నదుల సంగమంలో పుణ్యస్నానమాచరించనున్నారు.
ఉత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివచ్చే అవకాశం ఉండడంతో రాష్ట్రప్ర భుత్వం అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసింది. కాళేశ్వరానికి ఆధ్యాత్మిక, సాంస్కృతికంగా శతాబ్దాల చరిత్ర ఉంది. సరస్వతి నది జ్ఞాన దేవతకు ప్రతీక.
పుష్కర సమయంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నాన మాచరిస్తే మానవాళికి జ్ఞానం, ఆధ్యాత్మిక శక్తి సంప్రాప్తించడంతో పాటు పాపవిమోచనం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అంతేకాదు.. పుష్కర సమయంలో దానధర్మాలు చేసినా, పితృతర్పణాలు చేసినా మోక్షం పొందవచ్చని పురాణాలు చెప్తున్నాయి. పుష్కరాల సందర్భంగా కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో భక్తులు శివపూజ చేస్తారు. నది ఒడ్డున సరస్వతీదేవి ఆరాధన చేస్తారు.
రోజుకు 2 లక్షల మంది భక్తుల రాక..
కాళేశ్వరంలో చివరిసారి ఉమ్మడి పాలనలో 2013లో పుష్కరాలు జరిగాయి. తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చే మొదటి సరస్వతి పుష్కరాలు కావడంతో రాష్ట్రప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాకు దేశ నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివచ్చిన అనుభవాన్ని దృష్టిలో పెట్టకుని భారీగా ఏర్పాట్లు చేసింది.
త్రివేణీ సంగమంలో రూ.40 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. నది ఒడ్డున ఏర్పాటు చేసిన సరస్వతి, అరచేతుల్లో తాళపత్ర గ్రంథాల విగ్రహం పుష్కరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. 2013లో జరిగిన పుష్కరాలకు 20 లక్షల మంది భక్తులు కాళేశ్వ రానికి వచ్చి పుణ్యస్నాణమాచరించారని అధికారులు చెప్తున్నారు. ఈ సారి గతంలో కంటే రెట్టింపు భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
ప్రతి రోజూ సుమారు 2 లక్షల మంది వరకు భక్తులు పుణ్యస్నానమాచరిస్తారని అంచ నా వేస్తున్నారు. పుష్కరాలకు తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం కనిపిస్తున్నది. ఈసారి సుమారు 50 లక్షల మంది భక్తులు పుష్కర స్నానమాచరించేందుకు తరలివస్తారని ఓ అంచనా.
యంత్రాంగం ఇప్పటికే పారిశుధ్యం, పార్కింగ్, భద్రతాపరమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. తన సొంత నియోజకవర్గంలో పుష్కరాలు జరుగుతుండడంతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. అలాగే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయశాఖ ఉన్నతాధికారులూ పుష్కరాలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు.
దేశంలో ఐదు పవిత్ర పుణ్యక్షేత్రాల్లో..
దక్షిణ భారతదేశంలో కేవలం కాళేశ్వరంలోనే సరస్వతి పుష్కరాలు జరుగుతు న్నాయి. కాళేశ్వర ముక్తీశ్వరాలయంలో దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు (కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి) ఉండడం విశేషం. ఈ రెండు లింగాలకు అర్చకులు అభిషేకించిన పవిత్ర జలం గోదావరి, ప్రాణహిత నదుల సంగమ స్థానంలో కలుస్తుండడం మరో ప్రత్యేకత.
ఈసారి జరిగే పుష్కరాల్లో కాశీకి చెందిన పండితులు నదీ హారతి ఇవ్వనున్నారు. కాశీ పండితులు కాళేశ్వరానికి వచ్చి క్రతువులో పాల్గొనడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం దేశంలో నాలుగు చోట్ల సరస్వతి పుష్కరాలు జరుగనున్నాయి. ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, ఉత్తరప్రదేశ్‌లోని గంగ, యమున, సరస్వతీ నదుల సంగమ స్థానమైన ప్రయాగ్‌రాజ్, గుజరాత్‌లోని సోమనాథ్, రాజస్థాన్‌లోని పుష్కర్‌లో ఒకేసారి మొదలై.. ఒకేసారి పుష్కరాలు ముగియనున్నాయి.
పుష్కరాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం సర్కార్ ఇప్పటికే ‘సరస్వతి పుష్కరాలు -2025’ పేరిట ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. యాప్ ద్వారా భక్తులు కాళేశ్వరాని కి చేరుకునే మార్గాలు, అక్కడి వసతులు, ఘాట్ల వద్ద ఏర్పాట్ల గురించి ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంది.
పుష్కరాలకు తొలిరోజు సీఎం హాజరు కానుండగా, ఆ తర్వాతి రోజు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మిగిలిన రోజుల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విచ్చేయనున్నారు. అలాగే పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా త్రివేణీ సంగమంలో పుణ్యస్నానమాచరించనున్నారు.
రోజువారీ వేడుకలు..
పుష్కరాలు అంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పవిత్ర నదుల ఒడ్డున జరిగే ఓ మహా పండుగ. జ్యోతిష్య శాస్త్రాల అనుగుణంగా నవగ్రహాల గమన బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించిన సంవత్సరంలో సరస్వతీ నది వద్ద పుష్కరాలు జరుగుతాయి. ఆ ప్రకారం ఈసారి మే 15 నుంచి 12 రోజుల పాటు ఈ సరస్వతీ పుష్కరాలు జరుగనున్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి 12 నదులకు పుష్కరాలు జరుగుతాయి.
తొలిరోజు గురుమదనానంద సరస్వతి పీఠాధిపతి మాధవానంద సరస్వతి పుష్కరాలకు అంకురార్పణ చేస్తారు. 17న తుని తపోవన పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి, 18న పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్ధండ విద్యాశంకర భారతి మహాస్వామి, 19న నాసిక్ త్రయంబకేశ్వర్ మహామండలేశ్వర్ ఆచార్య సంవిధానంద సరస్వతి మహారాజ్, 23న హంపి విరుపాక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతిస్వామి పుష్కర స్నానమాచరిస్తారు.
మంత్రి శ్రీధర్‌బాబు సొంత నియోజకవర్గమైన మంథని నియోజకవర్గంలో కాళేశ్వర పుణ్యక్షేత్రం ఉంది. సరస్వతి పుష్కరాలు ఇక్కడే జరుగనుండడంతో మంత్రి పుష్కరాలపై ప్రత్యేక దృష్టి సారించారు. భక్తులకు మౌలిక వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా రు. ఆ పనులన్నింటినీ మంత్రి దగ్గరుండి చూసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్గ, గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మతోపాటు వీవీఐపీలు, వీవీఐపీలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని యంత్రాంగానికి సూచిస్తున్నారు.






