కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం
వనపర్తి మున్సిపల్ పరిధిలో కింది స్థాయి అధికారులు బాధ్యత లేకుండా, నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారు. యథేచ్ఛగా అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆస్తి పన్నుల వసూలులో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ధనవంతుల వద్ద తక్కువ పన్ను తీసుకుంటున్న అధికారులు పేదల వద్ద మాత్రం ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారు. న్యూ అసెస్‌మెంట్, అండర్ అసెస్‌మెంట్ ప్రకారం భవనాలను గుర్తించాల్సిన అవసరం ఉంది.
నంబర్లు లేని ఇండ్లు, షెడ్లు, భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లన్నీ గందరగోళంగా ఉన్నాయి. ఈ విషయమై వనపర్తి మున్సిపల్ సిబ్బందిపై సదరు జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో రెండు సార్లు ఫిర్యాదు అందింది. వారిపై కలెక్టర్ కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కలెక్టరేట్‌లో తమపై ఫిర్యాదు దాఖలైందని తెలిసినప్పటికీ మున్సిపల్ అధికారుల తీరులో ఎలాంటి మార్పూ లేకపోవడాన్ని ఏమనుకోవాలి? ఉన్నతాధికారుల పట్ల వారికున్న భయభక్తులనను ఎలా అర్థం చేసుకోవాలి?!
పోలిశెట్టి బాలకృష్ణ, వనపర్తి






