1 May, 2026 | 8:14 PM

తిమ్మంపేటలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన సర్పంచ్

01-05-2026 07:02 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండలం తిమ్మంపేట గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పెద్ద చెరువు పూడికతీత పనులను శుక్రవారం  సర్పంచ్ తుర్రం శ్రీనివాస్ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. గ్రామంలోని పెద్ద చెరువులో గత రెండు వారాలుగా పూడికతీత పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.ఈ పనుల్లో సుమారు 70 మంది ఉపాధి కూలీలు పాల్గొంటున్నారు. పని ప్రదేశానికి చేరుకున్న సర్పంచ్ శ్రీనివాస్ కూలీల హాజరు పట్టీ, మస్టర్ రోల్‌ను స్వయంగా పరిశీలించారు. కూలీలతో మమేకమై వారి సమస్యలు, కూలీ డబ్బుల చెల్లింపుపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ తుర్రం శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి, భూగర్భ జలాలు పెరగడానికి చెరువుల పూడికతీత చాలా ముఖ్యమని, కూలీలు ఎండను లెక్కచేయకుండా కష్టపడుతున్నారని పేర్కొన్నారు. పనిలో నాణ్యత పాటించాలని సూచించారు.ప్రతి ఒక్కరికీ సకాలంలో కూలీ డబ్బులు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి మెజర్మెంట్ చేయించాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు.సర్పంచ్ వెంట ఫీల్డ్ అసిస్టెంట్ రాంబాబు , మేట్ లు సోడే కేశవ్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.