18 July, 2026 | 10:42 AM

పెరుగుతున్న అగాథం!

13-06-2024 12:45 AM

ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ మధ్య దూరం 

తాజా ఎన్నికల్లో సహకరించని ఆర్‌ఎస్‌ఎస్

భాగవత్ వ్యాఖ్యలతో బయటపడ్డ విబేధాలు

ఆర్‌ఎస్‌ఎస్ పత్రికలోనూ బీజేపీ తీరుపై విమర్శలు

బీజేపీ సంప్రదించట్లేదని గుర్రుగా ఉన్న ఆర్‌ఎస్‌ఎస్

న్యూఢిల్లీ, జూన్ 12: ఆర్‌ఎస్‌ఎస్.. బీజేపీకి మాతృసంస్థ.. ఇటీవల కాలం వరకు రెండు సంస్థల మధ్య సహాయ సహకారాలు ఉండే వి. అయితే తాజాగా ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ మధ్య దూరం పెరుగుతోంది. నాగ్‌పూర్‌లో ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

గత కొంత కాలంగా బీజేపీ ఆధిపత్య ధోరణితో సంఘ్ పరివార్‌లో నేతలు అసంతృప్తిగా ఉన్నట్టు చెబుతున్నారు. అందుకే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఆర్‌ఎస్‌ఎస్ దూరంగా ఉందని విశ్లేషిస్తున్నారు. మొన్నటి వరకు నివురు గప్పిన నిప్పులా ఉన్నప్పటికీ.. ఇప్పుడు వీరి మధ్య విబేధాలు బహిర్గతమయ్యాయి.

అంటీముట్టనట్టుగానే..

సాధారణంగా ఏ ఎన్నికల్లోనైనా బీజేపీకి ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఇస్తుంటుంది. ఎన్నికల ప్రచారంలో కూడా సంఘ్ నేతలు పాల్గొంటారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో అసలు ఆర్‌ఎస్‌ఎస్ అంటీముట్టనట్టుగానే ఉంది. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ బీజేపీపై, ముఖ్యంగా ప్రధాని మోదీపై గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో భగవత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తనకు తాను ‘ప్రధాన సేవక్’ అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలకు ఇటీవల నాగ్‌పూర్‌లో జరిగిన సభలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ కౌంటర్ ఇచ్చారని విశ్లేషిస్తున్నారు. 

అందుకే బీజేపీకి చుక్కెదురు?

ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు ఇవ్వకపోవడంతోనే మహా రాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో ఆ పార్టీ తక్కువ స్థానాలు గెలుచుకుందని చెబుతున్నారు. కనీసం మెజారిటీ మార్కు కూడా దాటలేక చతికిలపడిపోయిందని పేర్కొంటున్నారు. ప్రధాని మోదీ చరిష్మా పెరుగుతుండటంతో ఆర్‌ఎస్‌ఎస్‌ను బీజేపీ పట్టించుకోవట్లేదని ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల హామీలు కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ను సంప్రదించకుండానే ఇచ్చేస్తున్నారని కోపంతో ఉన్నట్టు సమాచారం. ‘బీజేపీతో పెరుగుతున్న దూరం గురించి సంఘ్ నేతలు బహిరంగంగా చెప్పరు. కానీ ఇటీవల కాలంలో బీజేపీ ఆధిపత్య ధోరణి పెరగడంపై సంఘ్‌పరివార్ కాస్త ఇబ్బంది పడుతోంది’ అని సీనియర్ జర్నలిస్టు దీప్ హల్దర్ వివరించారు. ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యాలైన ఆర్టికల్ రద్దు, రామమందిర నిర్మాణాన్ని బీజేపీ సాకారం చేసిందని, అయితే 2019 నుంచి బీజేపీ అధినాయకత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ను సంప్రదించట్లే దని దీప్ పేర్కొన్నారు.

2014 ఎన్నికల్లో అన్నీ తానై..

ప్రధాని మోదీ ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఆర్‌ఎస్‌ఎస్ అన్నీ తానై బీజేపీకి అండగా నిలిచింది. నరేంద్ర మోదీకి మద్దతు పలికింది. అయితే  ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన అధికార కేంద్రంగా మారడం, ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేతలను ఆయన పెద్దగా పట్టించుకోకపోవడం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మధ్య అగాథం పెరడగానికి ప్రధాన కారణమని దీప్ హల్దర్ విశ్లేషించారు. ‘ఆర్‌ఎస్‌ఎస్ 2014, 2019 ఎన్నికల్లో పనిచేసినట్టే ఈ ఎన్నికల్లో కూడా పనిచేశాం. అందుకు విరుద్ధంగా పనిచేయాలని ఎవరూ మాకు ఆదేశాలు ఇవ్వలేదు’ అని ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేతలు పేర్కొన్నారు. 

బీజేపీది అతి నమ్మకం..

ఆర్‌ఎస్‌ఎస్ అధికార పత్రిక ఆర్గనైజర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ లీడర్ రతన్ శారద బీజేపీ వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ‘బీజేపీ కార్యకర్తలు, ఆ పార్టీ కి చెందిన చాలా మంది నేతల అతి నమ్మకానికి చెక్ పెట్టేలా ఎన్నికల ఫలితాలు వచ్చా యి’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఈ ఎన్నికల్లో బీజేపీ కోసం ఆర్‌ఎస్‌ఎస్ పనిచేయలేదన్న విమర్శలకు తొలుత సమాధా నం చెబుతా.. ఆర్‌ఎస్‌ఎస్ అనేది బీజేపీ కోసం క్షేత్ర స్థాయిలో పనిచేసే వ్యవస్థ కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అయిన బీజేపీకి సొంత కార్యకర్తలు ఉన్నారు’ అంటూ ఎద్దేవా చేశారు.

బీజేపీ కోసం క్షేత్రస్థాయిలో ఓటర్లను చైతన్యం చేసేందుకు తాము ఎంతగానో కష్టపడ్డామని ఆయన వివరించారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలే ఆర్‌ఎస్‌ఎస్‌ను లెక్కచేయకుండా వారి సహాయం కూడా అడగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘సిద్ధాంతపరమైన భాగస్వాములతో ఎన్నికల్లో కలిసి పనిచేయాలి. కానీ అలా వారు చేశారా? లేదు వారు కనీసం మమ్మల్ని సంప్రదించలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసిన చాలా మంది బీజేపీ అభ్యర్థులు బయటి నుంచి వచ్చిన వారేనని, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేసిన వారికి టికెట్లు ఇవ్వడంపైనా ఆర్‌ఎస్‌ఎస్ గుర్రుగా ఉందని చెబుతున్నారు.

అందుకే వారు బీజేపీకి క్షేత్రస్థాయిలో సహకారం అందించలే దని పేర్కొంటున్నారు. అయితే ఇది ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ మధ్య విబేధాలు కాదని, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్, ప్రధాని నరేంద్రమోదీకి మధ్య ఆధిపత్య పోరు అంటూ మరికొందరు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ పార్టీకి, సంఘ్ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయనడంలో సందేహం లేదు. ఈ అగాథాన్ని పూడ్చాలంటే  మళ్లీ ప్రధాని నరేంద్రమోదీ చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.