సర్పంచులదే కీలక పాత్ర
కలెక్టర్ స్నేహ శబరిష్
మహబూబాబాద్, మే 13 (విజయక్రాంతి): గ్రామ అభివృద్ధితో పాటు విద్యారంగ అభివృద్ధిలో సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు. బుధవారం ప్రజాపాలన ప్రగతీ ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో జెడ్ పి హెచ్ ఎస్ కురవి పాఠశాల యందు నిర్వహించిన కురవి, సిరోలు మండల సర్పంచుల ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిదిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పాఠశాల బలోపేతమే గ్రామాభివృద్ధికి పునాది అని స్పష్టం చేశారు. విద్యను ప్రజా ఉద్యమంగా మార్చాలని ప్రతి గ్రామంలో పాఠశాలల అభివృద్ధి పనులకు సర్పంచులు ముందుండాలన్నారు.
విద్యార్థుల హాజరు, పరిసరాల శుభ్రత, భద్రత, త్రాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక వసతులపై గ్రామ పంచాయతీలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. డ్రాప్‌అవుట్స్ను పూర్తిగా నిర్మూలించడం తక్షణ లక్ష్యం కావాలన్నారు. తల్లిదండ్రులను పాఠశాల కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా విద్యార్థుల నైపుణ్యాలు పెరుగుతాయని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇటీవలి పాఠశాల సందర్శనల్లో చూసిన మంచి పద్ధతులను పంచుకున్నారు.
ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్, స్మార్ట్ టీచింగ్, స్వచ్ఛత పట్ల విద్యార్థుల్లో పెరుగుతున్న అవగాహన వంటి అంశాలను ప్రశంసించారు. అన్ని గ్రామాల్లో ఇలాంటి మోడల్ స్కూల్స్ నిర్మించేందుకు సర్పంచులు చురుకైన పాత్ర పోషించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఆల్వాల సత్యనారాయణమూర్తి, మండల విద్యాధికారులు బాలాజీ నాయక్, ఇస్లావత్ లచ్చిరాం నాయక్, ఏసీజీఈ మందుల శ్రీరాములు. ఎఫ్‌ఏఓ బానోత్ శంకర్ నాయక్, సీఎంఓ వంగ సురేష్ ఏఎస్సి సంతోష్ ఎంపీడీవోలు వీరబాబు, మహమ్మద్ గౌస్ పాషా తదితరులు పాల్గొన్నారు.






