3 April, 2026 | 3:42 AM

సర్పంచ్ భర్త కిడ్నాప్

03-04-2026 01:54 AM

భూమి విషయంలో అడ్డొస్తున్నాడని.. 

ముదిగొండ(ఖమ్మం), ఏప్రిల్ 2 (విజయక్రాంతి): ముదిగొండ మండలం పండ్రెగుపల్లి సర్పంచ్ భర్త పాము సిల్వరాజును మార్చి 25 న కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. 10 మందిని ముదిగొండ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. అన్నదమ్ములైన షేక్ ఇబ్రాహీం, షేక్ ఫక్రుద్దీన్‌లకు పండ్రెగుపల్లిలో 8 ఎకరాల భూ మి పంపకాల విషయంలో వివాదం జరుగుతోంది.

షేక్ ఫక్రుద్దీన్ తన తల్లిదండ్రులను పట్టించుకోకుం డా హైదరాబాద్‌లో ఉంటున్నందున షేక్ ఇబ్రాహీం తల్లిదండ్రులను పోషించినందుకు గ్రామ పెద్దల సమక్షంలో 3 ఎకరాలు ఇవ్వాలని తెలిపారు. సిల్వరాజు కూడా షేక్ ఇబ్రా హీంకు మద్దతు తెలిపాడు. జనవరిలో షేక్  ఫక్రుద్దీన్, అతని కొడుకులు బోదల సాహెబ్ అలియాస్ ముస్తఫా, షేక్ ఖాసిం సాహెబ్ కలిసి హైదరాబాద్ నుంచి కిరాయి మనుషులని తెచ్చి ఫెన్సింగ్ వేస్తుండగా, పాము సి ల్వరాజు జనాలతో వెళ్లి అడ్డుకున్నాడు. దీంతో షేక్  ఫక్రుద్దీన్ తన కొడుకులు కలిసి పథకం పన్ని హైదరాబాద్‌కు చెందిన బోదల్ సాహెబ్ స్నేహితులైన సయ్యద్ మహమ్మద్,

మెయిర్బాన్ సింగ్, డంగి సిక్లికర్ కులజీత్ సింగ్, డంగి సిక్లికర్ ఆజాద్ సింగ్, ఇస్మాయిల్, కో మల, ఎండీ నూర్, వరికుప్పల తరుణ్ అను ట్రాలీ ఆటో డ్రైవరు అను కిరాయి మనుషులకు సిల్వరాజును చంపితే 15 లక్షలు సుపారీ ఇచ్చేలా మాట్లాడుకున్నారు. అడ్వాన్స్‌గా 5 లక్ష లు ఇచ్చారు. ఎని మంది కలిసి మార్చి 25న సిల్వరాజు ఖానాపురం వాకింగ్‌కు వెళ్తుండగా బలవంతంగా వాహనంలో హైదరాబాద్ తీసుకెళ్లారు. ఆఖరికి ఎల్‌బీ నగర్‌లో వదిలేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం నిందితులు  వైజాగ్‌కు పారిపోతుండగా తెలదారుపల్లి టోల్ ప్లాజా వద్ద అరెస్ట్ చేశామని సీఐ మురళీ తెలిపారు.