18 July, 2026 | 1:52 PM

అలా చేస్తే పరీక్షకున్న గౌరవం దెబ్బతింటుంది !

11-06-2024 09:39 PM

న్యూఢిల్లీ : వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్‌లో అవకతవకలు జరిగాయని, అందుకని ఆ పరీక్షను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్టు వెకేషన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పరీక్షను రద్దు చేస్తే దానికున్న విలువ, పవిత్రత దెబ్బతింటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. అలాగే పరీక్షలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల కౌన్సెలింగ్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేసి, ఈలోపు నీట్‌పై వస్తున్న ఆరోపణలపై తమకు సమాధానం కావాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని ఆదేశించింది. మే 5న దేశవ్యాప్తంగా నీట్ జరిగిన సంగతి తెలిసిందే. తొలుత జూన్ 14న ఫలితాలు విడుదల చేస్తారనే  వార్తలు బయటకు రాగా, అనూహ్యంగా లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగిన జూన్ 4న నీట్ ఫలితాలు రావడం విమర్శలకు దారి తీసింది. అంతేకాకుండా.. ఏకంగా 67 మందికి ఆలిండియా మొదటి రాంకు రావడం, వారిలో ఒకే పరీక్షా కేంద్రంలో నీట్ రాసిన విద్యార్థులకు 720 మార్కులకు 720 మార్కులు రావడం అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నది.