సరదా కోసం బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నుంచి టొరంటో వెళ్లే ఎయిర్ కెనడా విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం రేపింది. ఈ వ్యవహారంలో ఓ 13 ఏళ్ల బాలుడిని ఎయిఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా సరదా కోసమే ఈ పని చేసినట్లు చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం రాత్రి ఢిల్లీ నుంచి టొరంటో వెళ్లేందుకు ఎయిర్ కెనడా విమానం సిద్ధమవుతోంది.
ఈ క్రమంలోనే విమానంలో బాంబు అమర్చినట్లు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ కార్యాలయానికి రాత్రి 10.50 గంటల సమయంలో ఓ మెయిల్ వచ్చింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై తనిఖీలు చేయగా.. ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపించలేదు. దీంతో, తప్పుడు సమాచారం వచ్చినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈ పని చేసింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌కు చెందిన 13 ఏళ్ల బాలుడని దర్యాప్తులో తేలింది. బాలుడిని అదుపులోకి తీసుకొని విచారించగా పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
“ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో బాంబు బెదిరింపు ఘటన గురించి టీవీలో వార్త చూశాను. ఈ క్రమంలోనే తప్పుడు బాంబు బెదిరింపు ఈ మెయిల్ పంపాలనే ఆలోచన వచ్చింది. ఇలా చేస్తే పోలీసులు నన్ను పట్టుకుంటారో? లేదో? చూడాలనుకున్నా. సరదా కోసమే ఈ పని చేశా” అని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. విచారణ అనంతరం బాలుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట బాలుడిని ప్రవేశపెట్టినట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.






