30 May, 2026 | 2:31 AM

మహిళల ఆర్థికాభివృద్ధ్దే ధ్యేయంగా పథకాలు

30-05-2026 12:07 AM

రాష్ట్రంలో ఎస్ హెచ్ జీ లకు బ్యాంక్ లింకేజ్ కింద 57 వేల కోట్ల రుణాలు పంపిణీ చేశాము

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, మే 29 (విజయక్రాంతి): రాష్ట్రంలోని మహిళల ఆర్థిక అభివృద్దే ధ్యేయంగా పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాల కింద మహిళా స్వయం సహాయక సభ్యులకు బ్యాంక్ లింకేజీ రుణాల పంపిణీ కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్కే ఫంక్షన్ హాల్ లో శుక్రవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పాల్గొన్నారు.

337 సంఘాలకు బ్యాంక్ లింకేజీ కింద రూ. 40 కోట్లు, ఎఫ్ పీసీ, ఎఫ్ పీజీ సీఐఎఫ్ కింద 42 సంఘాలకు రూ.1 కోటి ఐదు లక్షలు, శ్రీనిధి రూరల్ కింద 278 సంఘాలకు రూ.7 కోట్ల 13 లక్షలు, బ్యాంక్ లింకేజీ మెప్మా రుణాలు 55 సంఘాలకు రూ.6 కోట్ల 33 లక్షలు, శ్రీ నిధి మెప్మా 61 సంఘాలకు రూ. కోటి 50 లక్షల విలువైన చెక్కులను మహిళా సంఘాల బాధ్యులకు ప్ర భుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అందజేశారు. అలాగే ధాన్యం కొనుగోలు కేం ద్రాలు నిర్వహించే సంఘాలకు రూ.11,36,113 కమిషన్ చెక్కును అందజేశారు. స్టాళ్లు ఏర్పాటు చేయగా, ప్రభుత్వ విప్, జిల్లా కలెక్టర్ పరిశీలించారు. 

 ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. 

మార్చి 6వ తేదీన 99 రోజుల కార్యాచరణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని గుర్తు చేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పథకాలపై వివరించడం.. భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు కార్యక్రమం కోసం ప్రభుత్వం ఈ కార్యాచరణ అమలు చేస్తుందని వివరించారు.

రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు 57 వేల కోట్లు బ్యాంక్ లింకేజ్ రుణాలు మంజూరు చేశామని వెల్లడించారు. రుణాలకు సంబంధించిన వడ్డీని తిరిగి చెల్లించామని తెలిపారు. కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, వీర్నపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు నాయక్, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున రావు. తహసీల్దార్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.