స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
20-07-2024 05:19 PM
హైదరాబాద్ : సికింద్రాబాద్ జవహర్ నగర్ లో స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ను తప్పించబోయి అదుపుతప్పిన స్కూల్ బస్సు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. బస్సు పొదల్లోకి వెళ్లడంతో అందులో ఉన్న విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు.
ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. స్థానికులు వెంటనే అప్రమత్తమై బస్సులో ఉన్న విద్యార్థులను కిందకు దింపారు. విద్యార్థులందరూ సురక్షితంగానే బయటపడటంతో స్కూల్ యజమన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.






