12-09-2024 03:50:00 AM
నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): ధాన్యం రవాణా టెండర్ల కోసం కుమ్ములాట జరిగింది. బుధవారం నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లో పోలీసుల ఎదుటే తోపులాట జరిగింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం గోదాం లేదా మిల్లులకు సరఫరా చేసేందుకు రవాణా టెండర్ల కోసం సివిల్ సప్లు మేనేజర్ దరఖాస్తులను ఆహ్వానించారు. ఒక్కో టెండర్‌కు రూ.2.20లక్షలు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. టెండర్ ఫారాలను నేరుగా టెండర్ బాక్స్‌లోనే వేయాలనే నిబంధనలు ఉన్నాయి.
దీంతో టెండర్‌దారులు బుధవారం కలెక్టరేట్‌లోని కార్యాలయానికి వచ్చి టెండర్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అర్హత లేకపోయినా రాజకీయ నేతలు తెరవెనుక చక్రం తిప్పుతూ తమ వర్గానికి చెందిన వారికే టెండర్ దక్కేలా పావులు కదిపారు. దీంతో నాగర్‌కర్నూల్ కలెక్టరేట్‌లోని సివిల్ సప్లు మేనేజర్ కార్యాలయంలో టెండర్‌దారుల మధ్య కుమ్ములాటకు దారి తీసింది. అధికార పార్టీకి చెందిన టెండర్‌దారులను మాత్రమే లోపలికి అనుమతి ఇస్తూ ఇతరుల ఫారాలను లాక్కుని అడ్డుకుని రభస చేస్తున్నా అక్కడే ఉన్న డీఎస్పీ గుర్రు శ్రీనివాసులు, సీఐ కనకయ్య, నాలుగు మండలాల ఎస్సై లు, సిబ్బంది ఏమీ చేయలేకపోయారు.
అధికార పార్టీ వ్యవహార శైలి జిల్లాలో తీవ్ర దుమారాన్ని లేపింది. నిబంధనల ప్రకారంగా టెండర్‌దారుడికి సొంతంగా పది ఫిట్‌నెస్ కలిగిన లారీలు, మరో 15 అద్దె లారీలు ఉండాలి. 0 కి.మీ. తరలిస్తే ఖర్చు రూ.221.50, మరో 12 కి.మీ. లు అదనంగా తిరిగితే రూ.3.45 ఎక్కువగా చెల్లించేలా బేసిక్ ధరలను నిర్ణయించారు. తక్కువ ధరను నమోదు చేసిన వారికే టెండర్ దక్కనుంది. సివిల్ సప్లు, పోలీసు శాఖను తమ ఆధీనంలోకి తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ నేతలు టెండర్లు దాఖలు చేస్తూ, వారికే టెండర్ దక్కేలా చక్రం తిప్పారని ఇతరులు ఆరోపిస్తున్నారు. టెండర్ దాఖలు చేయడానికి వచ్చిన వారిని బెదిరింపులకు గురిచేస్తూ రౌడీయిజాన్ని ప్రదర్శి స్తున్నా పోలీసులు ప్రేపక్షపాత్ర వహిస్తున్నారని మండిపడుతున్నారు.
నాలుగు డివిజన్లలో టెండర్లు
నాగర్‌కర్నూల్ జిల్లాలోని 4 డివిజన్లు ఉండగా.. కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ డివిజన్లలో ఒకటి చొప్పున టెండర్ దాఖల య్యాయి. అచ్చంపేటకు 2, కల్వకుర్తికి 4 టెండర్లు దాఖలయ్యాయి. ఆన్‌లైన్‌లో మాత్రం 20కి పైగా దాఖలు అయినట్లుగా తెలుస్తున్నది. అధికార పార్టీకి చెందని వారిని టెండర్ వేయకుండా అడ్డుకోవడంలో ఇటు అధికార వర్గాలు, అటు పోలీ సులు పంతం నెగ్గించుకున్నట్లు చర్చ జరుగుతున్నది. ఓ మహిళా టెండర్‌దారు నుంచి ఫారాలను దొంగిలించగా మరో టెండర్‌దారున్ని కారులోనే నిర్బంధించారు. మరొకరి నుంచి మొదటి అంతస్థులోనే కాంగ్రెస్ కార్యకర్తలు ఫారాలను లాక్కున్నారు. సమయం దాటిపోవ డంతో టెండర్‌దారులందరు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. టెండర్‌ను రద్దు చేయయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. తన టెండర్ ఫారాలను లాక్కున్ని ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.