calender_icon.png 11 November, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గచ్చిబౌలిలో రేవ్‌పార్టీ!

12-09-2024 03:50:00 AM

పోలీసుల అదుపులో ఆరుగురు అమ్మాయిలు, 12 మంది అబ్బాయిలు 

వారిలో సినీ, సాఫ్ట్‌వేర్, ప్రభుత్వ ఉద్యోగులు!

పార్టీలో గంజాయి, మద్యం స్వాధీనం

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 11 ( విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో మరోసారి రేవ్‌పార్టీ కలకలం రేపింది.  మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు  సమాచారం అందుకొని దానిని భగ్నం చేశారు.  ఓ రైల్వే కాంట్రాక్టర్ మంగళవారం రాత్రి తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలనుకున్నాడు. అనుకుందే తడువుగా గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీలోని ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్ బుక్ చేసి, పార్టీకి స్నేహితులు, పరిచయస్తులను ఆహ్వానిం చాడు.

పార్టీలో గంజాయి, డ్రగ్స్, విదేశీ మద్యం ఇతర మత్తు పదార్థాలను సమకూర్చాడు. ఆదనంగా స్నేహితుల కోరిక మేరకు అమ్మాయిలను పిలిపించాడు. అందరూ కలిసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుండగా, పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పార్టీ నిర్వహిస్తున్న అపార్ట్‌మెంట్‌పై దాడి చేశారు.  ఆరుగురు అమ్మాయిలు, 12 మంది అబ్బాయిలు మొత్తం 18 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రేవ్ పార్టీలో 45 గ్రాముల గంజాయి, ఈ సిగరెట్లు, విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడిన వారికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ అని తేలినట్టు తెలుస్తోం ది.  ఈ రేవ్ పార్టీలో సినీ రంగానికి చెందిన వారితోపాటు సాఫ్ట్‌వేర్, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 18 మందికి 41ఏ కింద నోటీసులు ఇచ్చామని గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలను గురువారం వెల్లడిస్తామని మాదాపూర్ డీసీపీ జీ వినీత్ పేర్కొన్నారు.