భారత్‌లో సీ-295 విమానాల ప్లాంట్
స్పెయిన్ అధ్యక్షుడితో కలిసి ప్రారంభించిన ప్రధాని మోదీ
గుజరాత్ వడోదరాలో విమాన తయారీ కేంద్రం
సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎయిర్‌బస్, టాటా గ్రూప్
విదేశాల్లో ఎయిర్‌బస్‌కు చెందిన మొదటి ప్లాంట్ ఇదే
వడోదరా ప్లాంట్‌లో 40 విమానాల తయారీ
వడోదరా (గుజరాత్), అక్టోబర్ 28: భారత ప్రధాని నరేంద్రమోదీ, స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్‌తో కలిసి గుజరాత్‌లోని వడోదరాలో సీ విమానాలను నిర్మించే టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్‌ను సోమవారం ప్రారంభించారు. టాటాల భాగస్వామ్యంతో ఎయిర్ బస్ సంస్థ ఈ కేంద్రాన్ని నెలకొల్పింది. ఎయిర్‌బస్ వేరే ఖండంలో తమ విమానాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. సీ విమానాలు సైనిక రవాణాకు ప్రసిద్ధి చెందినవి. వడోదరా ప్లాంట్‌లో 40 సైనిక విమానాలను నిర్మించనుండగా ఒప్పందంలో భాగంగా 16 విమానాలను ఎయిర్‌బస్ నేరుగా భారత్‌కు అందించనుంది. కాగా, భారత్‌లో తొలి పూర్తి స్థాయి విమాన తయారీ కేంద్రంగా ఈ ప్లాంట్ రికార్డు సృష్టించింది. కాగా, ఇప్పటివరకు 5 సీ విమానాలను భారత వాయుసేనకు అందాయి.
టాటా ఉంటే సంతోషించేవారు: మోదీ
ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ.. ఈ తయారీ కేంద్రం భారత్ మధ్య భాగస్వామ్యాన్ని సరికొత్త మార్గంలో నడిపిస్తుంది. టాటా సంస్థ అధినేత రతన్ టాటాను మనం కోల్పోయాం. ఈ సందర్భంలో ఆయన ఉండి ఉంటే దీనిని చూసి ఎంతో సంతోషించేవారు అని మోదీ నివాళి అర్పించారు. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ మిషన్‌ను బలోపేతం చేస్తుందని చెప్పారు.
మోదీ విజన్ విజయమిది: పెడ్రో
ఇది ఆధునిక పరిశ్రమ మాత్రమే కాదని, రెండు గొప్ప కంపెనీల మధ్య ఒక అసాధారణ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు స్పెయిన్ అధ్యక్షుడు పెడ్రో సాంచెజ్ అభివర్ణించారు. ఈ రెండు సంస్థల భాగస్వామ్యంతో భారత వైమానికరంగ పురోగతికి బాటలు వేస్తుందని చెప్పారు. ఇది భారత్, మోదీ విజన్ విజయంగా పేర్కొన్నారు. భారత్‌ను పారిశ్రామిక శక్తిగా మార్చేందుకు మోదీ దృష్టి పెట్టారని ప్రశంసించారు.
పెడ్రోతో కలిసి మోదీ రోడ్‌షో
భారత్ పర్యటనలో భాగంగా వడోదరా విమానాశ్రయానికి చేరుకున్న పెడ్రో సాంచెజ్‌తో కలిసి మోదీ రోడ్ షో నిర్వహించారు. ఎయిర్‌పోర్ట్ నుంచి నేతలు ఇద్దరూ టాటా ఎయిర్‌క్రాఫ్ట్ కాంప్లెక్స్ వరకు 2.5 కిలోమీటర్ల పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ప్రయాణించారు. టాటా కాంప్లెక్స్‌లో వీరిద్దరికీ కళాకారులు స్వాగతం పలికారు. ప్రారంభోత్సవం తర్వాత ద్వైపాక్షిక భేటీ కోసం వడోదరాలోని లక్ష్మీవిలాస్ ప్యాలెస్‌కు చేరుకున్నారు.
రెండేళ్లలో తొలి విమానం
సీ విమానం ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. రెండేళ్లలో అంటే 2026 సెప్టెంబర్‌లో తొలి విమానాన్ని డెలివరీ చేస్తామని మోదీకి హామీ ఇచ్చారు. ఆ రోజు మళ్లీ మోదీ చేతుల మీదుగానే విమానాన్ని ఆవిష్కరిస్తామని, అందుకు తగినట్లు ప్రధాని డేట్లను రిజర్వ్ చేసేలా పీఎంవోతో సమన్వయం చేసుకుంటామని చెప్పారు. సీ విమానాల తయారీ కోసం 240 మంది టాటా ఇంజినీర్లు స్పెయిన్‌లో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం రతన్ టాటా 12 ఏళ్ల పాటు కృషి చేశారని గుర్తుచేశారు. ఎయిర్‌బస్‌తో సంబంధాలు నడిపి ఈ భాగస్వామ్యానికి పునాది వేసినట్లు వెల్లడించారు. 2031 ఆగస్టు నాటికి పూర్తి సంఖ్యలో విమానాలు అందనున్నాయి.
2021 సెప్టెంబర్‌లో ఒప్పందం
సీ విమానాల సరఫరాకు భారత్, స్పెయిన్ మధ్య 2021 సెప్టెంబర్‌లో ఒప్పందం కుదిరింది. దీని విలువ రూ.21,935 కోట్లు. ఇందులో 16 విమానాలు ఎయిర్‌బస్ నేరుగా భారత్‌కు అందిస్తుంది. మిగితా 40 విమానాలు వడోదరాలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌లో తయారవుతాయి. సోవియట్‌కు చెందిన ఆంటోనోవ్ ఏఎన్ హెచ్‌ఏఎల్‌కు చెందిన ఆవ్రో విమానాల స్థానంలో భారత వాయుసేన వీటిని ప్రవేశపెట్టనుంది. హైదరాబాద్‌లోని మెయిన్ కన్‌స్టిట్యూయెంట్ అసెంబ్లీలో సీ విడిభాగాల ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది.
ఈ విమానాల్లో 5 నుంచి 10 టన్నుల సామగ్రిని రవాణా చేయవచ్చు
ఇందులో 50 మంది పారాట్రూపర్లు లేదా 71 మంది వరకు పౌరులు ప్రయాణించవచ్చు.
ఈ విమానం గరిష్ఠంగా 260 నాట్ల వేగంతో ప్రయాణిస్తుంది. 30 వేల అ డుగుల ఎత్తులో ప్రయాణించగలదు.
టేకాఫ్, ల్యాండింగ్‌కు తక్కువ దూరం రన్‌వే సరిపోతుంది. ఎమర్జెన్సీ సమయంలో చిన్న ఎయిర్‌స్ట్రిప్‌లపైనా దిగ గలదు. చదును లేని, ఇసుక, గడ్డి ఉన్న ప్రాంతాల్లోనూ ల్యాండ్ అవుతుంది.
సీ విమానాలు 11 గంటల పాటు నిరంతరాయంగా ఎగరగలవు. పగలు, రాత్రి తేడా లేకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రయాణం చేస్తాయి. ఎడారి, సముద్ర ప్రాంతాల్లోనూ సాధారణ కార్యకలాపాలు నిర్వహించగలదు.
ఎమర్జెన్సీ సమయాల్లో ఐసీయూ కేంద్రాలుగానూ ఈ ఎయిర్‌క్రాఫ్ట్ ఉపయోగపడుతుంది.
ఈ విమానాల కోసం 13,400 డీటెయిల్ భాగాలు, 4,600 అసెంబ్లీలు, 7 ప్రధాన భాగాల అసెంబ్లీ ప్రక్రియ భారత్‌లోనే జరుగుతుంది.
వీటి సరఫరా కోసం 125 ఎంఎస్‌ఎంఈలను టాటా గ్రూప్ గుర్తించింది.
భారత్ ఎలక్ట్రానిక్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ రూపొందించిన ఎలక్ట్రానిక్ వార్‌పేర్ సూట్లను ఈ 56 విమానాల్లో అమర్చుతారు.
ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా 600 మం ది నైపుణ్య ఉద్యోగులు, 3వేల మంది మధ్యశ్రేణి నైపుణ్యం కలిగిన వారికి, పరోక్షంగా మరో 3 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.






