పింక్ డ్రగ్ మిస్టరీ ఏంటి?
ఈ డ్రగ్ మెదడుపై ప్రభావం చూపిస్తుందా?
పాప్ సింగర్ లియామ్ పేన్ మరణంతో మొదలైన చర్చ
న్యూఢిల్లీ, అక్టోబర్ 2౮: ప్రముఖ పాప్ గాయకుడు లియామ్ పేన్ మరణంతో పింక్ డ్రగ్ వాడకంపై ఆందోళన నెలకొంది. పింక్ కొకైన్ అనేది కేవలం గులాబీ రంగులోనే ఉంటుంది తప్ప అందులో కొకైన్ ఉండదు. అయితే ఇందులో వాడే పదార్థాలపై నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పింక్ కొకైన్‌పై చేసిన టెస్టుల్లో అసాధారణ ఫలితాలు వచ్చాయని, ఎక్కువ రోజులు తీసుకుంటే దానికి బానిస అయ్యే అవకాశముందని చెబుతున్నారు. లియామ్ ఈ డ్రగ్ తీసుకున్న తర్వాతే మూడో అంతస్తు నుంచి దూకి చనిపోయినట్లు గుర్తించారు. పోస్టుమార్టం నివేదికలోనూ ఆయన శరీరంలో పింక్ డ్రగ్ ఉన్నట్లు గుర్తించారు. పింక్ డ్రగ్‌లో కెటామిన్, మెతాంఫెటమిన్, ఎండీఎంఏ వంటివి ఉంటాయని, వీటి మోతాదు ను బట్టి శరీరంపై ప్రభావం వివిధ రకాలుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ధర తక్కువగా ఉండటంతో..
పింక్ కొకైన్ లేదా తుసి మొదటిసారి 1970లలో లాటిన్ అమెరికాలో వాడకంలోకి వచ్చింది. మళ్లీ 2010లో కొలంబియాలో ప్రారంభమైన దీని వాడకం యూరోప్‌కు కూడా వ్యాపించింది. ఇది తక్కువ ధరకు (గ్రాము 99 డాలర్లు) దొరకడంతో ప్రాచుర్యం పొందింది. అయితే ఇందులో రసాయనాల మోతాదును బట్టి మనిషిపై ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కెటామిన్ అధికంగా ఉంటే భ్రాంతి లేదా సైకోమోటార్ లక్షణాలు కలుగుతాయని వైద్య పరిశోధకుడు జోష్ ట్రెబాచ్ తెలిపారు. అయితే అమ్మేవారికి, వాడేవారికి దాని వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్‌లపైనా అవగాహన లేదు. పేన్ మరణంతో ప్రపంచవ్యాప్తంగా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఈ డ్రగ్‌పై దృష్టి పెడుతున్నారు.






