4 April, 2026 | 11:47 PM

వేతనం అందక వెతలు

02-05-2024 01:46 AM

పెద్దపల్లి జిల్లాలో ఉపాధి సిబ్బందికి జీతాల్లేవ్

వరుసగా నాలుగు నెలలు పెండింగ్

కుటుంబాలను పోషించుకోలేక 201 మంది అవస్థలు

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ 

పెద్దపల్లి, మే 1 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో కరువు నివారించి వ్యవసాయ కూలీలకు ఏడాదిలో 100 రోజుల పాటు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రెండు దశాబ్దాల నుంచి ఉపాధి హామీ పథకం అమల వుతున్నది. జాబ్‌కార్డు ఉన్న ప్రతిఒక్కరికీ ప్రభుత్వం గ్రామంలోనే ఉపాధి కల్పిస్తుంది. కూలీలకు పని కల్పించడం, వారి హాజరు రికా ర్డు చేయడం, వారికి వేతనాలు చెల్లించే బాధ్యతలను క్షేత్రస్థాయిలో ఏపీవోలు, టెక్నికల్ అసి స్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు నిర్వహిస్తారు.పెద్దపల్లి జిల్లా పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి ఆరునెలలుగా వేతనాలు అందలేదు. ప్రభుత్వం ఆరు నెలల వేతనాలను మరిచి, కేవలం రెండు నెలలు వేతనాలు మాత్రమే విడుదల చేసింది. విడుదలైన అరకొర వేతనంతో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నామ ని సిబ్బంది వాపోతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపినా ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని ఆవేదనం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లావ్యాప్తంగా సిబ్బంది ఇలా..

జిల్లావ్యాప్తంగా 14 మండలాల పరిధిలో తొమ్మిది మంది ఏపీవోలు, 27 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, జిల్లాలోని 266 గ్రామ పంచాయతీల్లో 175 ఫీల్డ్ అసిస్టెంట్లు విధులు నిర్వహిస్తున్నారు.  ఒక్కో ఏపీవోకు నెలకు సుమారు రూ.30 వేల నుంచి రూ. 40 వేలు, టిక్నికల్ అసిస్టెంట్లకు సుమారు రూ.20 వేలు, ఫిల్డ్ అసిస్టెంట్లకు రూ.10 వేల నుంచి రూ.12 వేల చొప్పున ప్రభుత్వం వేతనాలు జమ చేయాల్సి ఉన్నది. వీరందరికీ నాలుగు నెలలుగా సుమారు రూ.7 లక్షల మేర వేతనాలు నిలిచిపోయాయి. వేతనాలు అందకపోయినా ప్రతిరోజూ విధు లకు హాజరవుతున్నామని, కొన్ని పోస్టులను భర్తీ చేయకపోవడంతో తామే అదనపు పనులు చేస్తున్నామని, రాష్ట్రప్రభుత్వం వెంటనే స్పందించి తమకు వేతనాలు విడుదల చేయాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.

 ఆందోళన వద్దు..

 ఉపాధి హమీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి నాలుగు నెలల నుంచి వేతనాలు అందడం లేదన్నది వాస్తవమే. ఈ నెల మొదటి వారంలో వేతన చెల్లింపుల నిధులు విడుదలవుతాయని మాకు సమాచారం ఉంది. నిధులు మంజూరైన వెంటనే సిబ్బంది ఖాతాల్లో వేతనాలు జమ చేస్తాం. సిబ్బంది ఎవరూ ఆందోళన చెందొద్దు.

 రవీందర్ రాథోడ్, 

డీఆర్డీవో, పెద్దపల్లి


వేతనాల్లేక ఇబ్బంది పడుతున్నాం..

నేను మంథని మండలంలోని లక్కేపూర్ ఫీల్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాను. ఫిల్డ్ అసిస్టెంట్లతో పాటు పథకంలో పనిచేస్తున్న ఇతర సిబ్బందికి నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. దీంతో కుటుంబాన్ని పోషించుకోలేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం. వేతనాలు విడుదల చేయాలని ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలు అందించినా ప్రయోజనం లేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యపై స్పందించి మా ఖాతాల్లో వెంటనే వేతనాలు జమ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

 కోడూరి వెంకటేష్, ఫిల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, పెద్దపల్లి