08-01-2026 01:13:17 AM
13 నాటికి పోలింగ్ స్టేషన్ల ముసాయిదా ప్రచురించాలి
16న పోలింగ్ స్టేషన్ల వివరాలు, ఫొటోతో ఓటర్ల తుది జాబితా
అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎస్‌ఈసీ రాణికుముదిని వీసీ
నేడు రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషన్ సమావేశం
హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): రాష్ట్రంలో వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను ఈనెల 12న ప్రచురించాలని, 13 నాటికి పోలింగ్ స్టేషన్ల వివరాలతో కూడిన ముసాయిదాను విడుదల చేయాలని ఎన్నికల కమిషనర్ అధికారులను ఆదేశించారు. నేడు రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమావేశాన్ని నిర్వహించనుంది. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) రాణి కుముదిని మున్సిపల్ ఎన్నికలపై ఉన్నతాధికారులతతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వివిధ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్‌ల కమిషనర్‌లో ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల సన్నాహకాలపై సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఈసీ కమిషనర్ మాట్లాడుతూ.. ఈనెల 12న వార్డు ల వారీగా ఓటర్ల తుది జాబితాను ప్రచురించాలని, 13 నాటికి పోలింగ్ స్టేషన్ల వివరాలను ముసాయిదాను ప్రచురించాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ప్రచురించాలని సూచించారు. ఈ క్రమంలోనే గురువారం రాష్ట్రంలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై చర్చించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. కాగా ఇప్పటికే మండల, జిల్లాస్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశాలు ముగిశాయి. తెలంగాణలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీ పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.