13 March, 2026 | 7:11 AM

పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్

13-03-2026 12:31 AM

సిద్దిపేట క్రైం, మార్చి 12 : పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సిద్దిపేట జిల్లాలోని పరీక్షాకేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్ 163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ ఎస్.రష్మీ పెరుమాళ్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 82 పరీక్షా కేంద్రాల చుట్టూ 500 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడరాదని సూచించారు. ఈ ఆంక్షలు పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.

పరీక్షా కేంద్రాల పరిసరాల్లో కర్రలు, రాళ్లు, ఆయుధాలు, ఇతర ప్రమాదకరమైన వస్తువులు కలిగి ఉండటం నేరమన్నారు. పరీక్షలు జరిగే సమయంలో సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని కమిషనర్ ఆదేశించారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా పరీక్షలు రాసేలా అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు తగిన బందోబస్తు, రక్షణ ఏర్పాట్లు చేయాలని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.