నడిరోడ్డుపై గేట్ వాల్వ్.. ప్రమాదకరంగా ప్రయాణం
కేసముద్రం, మార్చి 12 (విజయక్రాంతి): కేసముద్రం పట్టణంలో ఇటీవల రోడ్ల విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే గతంలో తాగునీటి సరఫరా కోసం వేసిన మిషన్ భగీరథ పైప్ లైన్లు, గేట్ వాల్వ్ రోడ్ల మధ్యలో ఉండడంతో ప్రస్తుతం ప్రమాదకరంగా ప్రయాణం మారింది. రోడ్ల మధ్యలో అక్కడక్కడ గేట్ వాల్వ్ ఉన్నచోట నీళ్లు విడిచిపెట్టడానికి ప్లాస్టిక్ పైపులను అమర్చారు. ఇవి రాత్రిపూట కనిపించకపోవడంతో ఇటీవల తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ సంఘటనలపై స్పందించిన కేసముద్రం సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్ ఐ క్రాంతి కిరణ్ బ్లూ కోట్స్ పోలీసులు రామకృష్ణ, రాంజీ చేత ప్రమాదాలు జరిగే చోట రాత్రిపూట పైపులు కనిపించే విధంగా రేడియం స్టిక్కర్లు వేయించారు. అయితే నడిరోడ్డులో ఉన్న మిషన్ భగీరథ గేట్ వాల్వ్ ను రోడ్డు పక్కన ఏర్పాటుచేసి శాశ్వత ప్రాతిపదికన ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.




