వ్యవస్థాగత బలంతో బీసీలకు పీఠం
బీసీలు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో విశేషంగా వినిపిస్తోంది. అంతవరకు బాగానే ఉంది. కానీ కేవలం ఆశ లేదా జనాభా ఆధిక్యం సరిపోవు. దానికి బలమైన ‘పాదు’, నిలకడైన ‘పందిరి’ ఉండాలి. ప్రజాస్వామ్యంలో జనాభా నిష్పత్తి(Population Ratio) ప్రకారం వెనుకబడిన తరగతులకు దక్కాల్సిన అధికారం, దాని సాధనకు అవసరమైన వ్యూహాన్ని ఈ రూపకం అద్భు తంగా ఆవిష్కరిస్తుంది. ఒక మొక్క నేలలో నిలబడి ఎదగడానికి బలమైన ‘పాదు’, అది పైకి పాకి విస్తరించి ఫలాలను ఇవ్వడానికి దృఢమైన ‘పందిరి’ ఎంత అవసరమో, రాజకీయాల్లో బీసీలు అత్యున్నత స్థానానికి చేరడానికి కూడా అలాంటి వ్యవస్థాగత బలం అంతే అవసరం.
ఈ రాజకీయ రూపకంలో ‘పాదు’ అం టే ఐక్యత, భావజాలం, స్వీయగౌరవం, నాయకత్వం, కార్యకర్తల నిర్మాణం. ‘పందిరి’ అంటే ఎన్నికల వనరులు, ఆర్థిక బ లం, మీడియా, సామాజిక కూటములు, రాజకీయ వ్యూహం. ఈ రెండింటినీ స్పష్టం గా అర్థం చేసుకోకుండా కేవలం బీసీ జనా భా ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి పదవిని ఆశించడం రాజకీయ వాస్తవాలను విస్మరించడమే అవుతుంది. జనాభా సం ఖ్య ఒక శక్తి; కానీ ఆ సంఖ్యను సంఘటిత రాజకీయ శక్తిగా మార్చే సంస్థాగత నిర్మాణమే అధికార సాధనకు అసలు పునాది.
ఈ రాజకీయ రూపకంలో ‘పాదు’ అనే ది ఒక వర్గం అంతర్గత బలానికి, ఐక్యతకు సంకేతంగా నిలుస్తుంది. బీసీలు అంటే ఒకే కులం కాదు; అది అనేక ఉపకులాల సమాహారం. అందువల్ల ఉపకులాల మధ్య ఉన్న అంతర్గత వ్యత్యాసాలను అధిగమించి ఒక బలమైన సామాజిక ఐక్యతను సాధించడమే నిజమైన ‘పాదు’.
అయితే ‘పాదు’ ఎంత గట్టిగా ఉన్నా మొక్క పైకి విస్తరించాలంటే ‘పందిరి’ తప్పనిసరి. రాజకీయాల్లో పందిరి అంటే అవ సరమైన మద్దతు వ్యవస్థ. ప్రధాన రాజకీయ పార్టీలలో బీసీ నాయకులకు కేవలం అలంకారప్రాయమైన పదవులు ఇవ్వడం కాకుండా, గెలిచే అవకాశాలున్న స్థానాలను కేటాయించేలా ఒత్తిడి తేగలగడం ఇం దులో మొదటి భాగం. ప్రధాన రాజకీయ పార్టీలు బీసీల సంఖ్యాబలాన్ని ముఖ్యమంత్రి స్థాయి నాయకత్వంగా మార్చే రాజకీయ సంకల్పం ఇంకా స్పష్టంగా కనిపిం చడం లేదు. అందువల్ల బీసీ సమాజం కేవ లం తమ సంఖ్యను చెప్పుకోవడం కాకుం డా, ఆ సంఖ్యను రాజకీయ చర్చలో నిర్ణయాత్మక శక్తిగా మార్చుకోవాలి.
నేటి ఖరీదైన ఎన్నికల వ్యవస్థలో పోటీపడటానికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవడం కూడా అత్యంత కీల కం. ఈ వనరుల బాధ్యతను బీసీ సమాజంలోని ఆర్థికంగా ఎదిగిన వర్గాలు, ఉద్యోగులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, సామాజిక స్పృహ కలిగిన శ్రామిక వర్గాలు తీసుకోవాలి. తమ స్వరాన్ని బలంగా వినిపించే మీడియా మద్దతుతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఇతర సా మాజిక వర్గాలతో ఐక్యతకోసం కృషి చేయాలి. వ్యూహాత్మక కూటములను ని ర్మించుకున్నప్పుడే ఈ ‘పందిరి’ సంపూర్ణమవుతుంది.
అయితే బీసీ రాజకీయ బలం కేవలం ఆర్థిక వనరులతోనూ, ఎన్నికల కూటములతోనూ నిర్మించబడదు. పాదు కింద ఉన్న నేల భావజాలంతో బలపడాలి. బీసీ నాయకుడు కేవలం తన కుల సమస్య తెలిసిన వ్యక్తిగా కాకుండా రాజ్యాంగం, సామాజిక న్యాయం, ఆర్థిక విధానాలు, స్థానిక పాలన, బడ్జెట్, చట్టాలు, కుల నిర్మాణం, ప్రజాస్వామ్య వ్యవస్థలను అర్థం చేసుకున్న నాయకుడిగా ఎదగాలి. అప్పుడు మాత్రమే అతను తన కులానికి మాత్రమే కాకుండా మొత్తం సమాజానికి నాయకత్వం వహిం చే స్థాయికి చేరుకుంటాడు.
ఇప్పటివరకు ఉన్న రాజకీయ వాతావరణాన్ని పరిశీలిస్తే, బీసీలు జనాభాపరంగా పెద్ద సామాజిక వర్గంగా ఉన్నప్పటికీ, అధికారం దగ్గరకు వచ్చేసరికి కొన్ని పరిమితు లు వారిని వెనక్కి లాగుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చడానికి ఎన్నికల సమయంలో ఏర్పడే తాత్కాలిక ఐక్యత కాకుండా, నిరంతర రాజకీయ నిర్మాణం అవసరం.
1. ఉపకులాల మధ్య భావజాల సంబంధం:
మేమంతా బీసీలమే అనే నినాదం ఎన్నికల వేళ మాత్రమే వినిపించి, ఆ తర్వాత ఒక ఉపకులం మరో ఉపకులం పట్ల చిన్నచూపు, పోటీతత్వం కొనసాగితే అది తాత్కాలిక ఐక్యతే తప్ప నిజమైన ‘పా దు’ కాదు. గ్రామస్థాయి నుంచే ప్రతి ఉపకులానికి చేరేలా స్వచ్ఛమైన బీసీ ఉద్యమ ఆలోచనను తీసుకెళ్లాలి.
2. గులాంగిరి లేని నాయకత్వం:
రెండోది, స్వతంత్రంగా ఆలోచించగల, ప్రశ్నించగల, చర్చించగల నాయకత్వాన్ని నిర్మించుకోవడం.
3. శాశ్వత కార్యకర్తల వ్యవస్థ:
మూడోది, ఎన్నికల సమయంలో మా త్రమే కదిలే నిర్మాణం కాకుండా గ్రామస్థాయి నుంచి ఏడాది పొడవునా పనిచేసే కార్యకర్తల వ్యవస్థను నిర్మించుకోవడం.
4. ఎస్సీ-, ఎస్టీ-, మైనారిటీలతో ఐక్యత:
బీసీ రాజకీయాధికారం మరో సామాజిక ఆధిపత్యాన్ని నిర్మించడానికి కాదు, సా మాజికంగా అణగారిన వర్గాల ప్రజాస్వా మ్య భాగస్వామ్యాన్ని విస్తరించడం. అందువల్ల ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఇతర అణ గారిన సామాజిక వర్గాలతో బీసీ ఉద్యమం నిజాయితీగల ఐక్యతను నిర్మించాలి.
5. అంతర్గత అసమానతపై
స్వీయ పరిశీలన: బయటి కులాల నుంచి వివక్షను ఎదుర్కొంటున్న బీసీ ఉద్యమం, తనలోని అసమానతలను కూడా ప్రశ్నించాలి. ఒక బీసీ కులం మరో బీసీ కులాన్ని చిన్నచూపు చూ డటం, సామాజికంగా వెనుకబడిన ఉపకులాలపై ఆధిపత్య భావన ప్రదర్శిస్తే బీసీ ఐక్యత అసంపూర్ణంగానే ఉంటుంది.
ఈ ఐదు కలిసినప్పుడే పాదు బలపడుతుంది. ఆ పాదుపై ఎన్నికల వనరులు, ఆర్థిక బలం, మీడియా, సామాజిక కూటములు, రాజకీయ వ్యూహం అనే ‘పందిరి’ నిర్మించాలి. అప్పుడు మాత్రమే బీసీల సంఖ్యాబలం నిలకడైన రాజకీయ శక్తిగా మారుతుంది.
కానీ ఇక్కడ మరో విషయం స్పష్టంగా గుర్తించాలి. బీసీ సీఎం అనేది అంతిమ లక్ష్యం కాదు; బీసీలకు నిర్ణయాధికారంలో సముచిత భాగస్వామ్యం ఏర్పడిందనడానికి ఒక రాజకీయ ప్రతీక. ఒక వ్యక్తి ముఖ్య మంత్రి కావడం కంటే, బీసీ సమాజం విధాన నిర్ణయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకోవడమే అసలు రాజ్యాధికారం. జనాభా బలం పాదు కాదు. దాన్ని రాజకీయ చైతన్యంగా మార్చినప్పుడే పాదు. ఓట్ల సంఖ్య పందిరి కాదు. దాన్ని రాజకీయ వ్యూహంగా మార్చినప్పుడే పందిరి. ఒక బీసీ వ్యక్తి సీఎం కావడం మాత్రమే రాజ్యాధికారం కాదు. బీసీ సమాజం నిర్ణయాధికారాన్ని ప్రభావితం చేసే స్థాయికి చేరడమే అసలు రాజ్యాధికారం.
వ్యాసకర్త: సత్యశోధక మహాసభ ప్రతినిధి, 9948872190
-పాపని నాగరాజు






