గ్రామాల్లో భద్రతా చర్యలు పటిష్టం
హుస్నాబాద్ ఏసీపీ సదానందం
హుస్నాబాద్, మే 15: గ్రామాల్లో భద్రత చర్యల పటిష్టం కోసం సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని హుస్నాబాద్ ఏసిపి ఎస్ సదానందం అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో భద్రతా చర్యలను మరింత బలోపేతం చేస్తూ గ్రామ నాలుగు దిక్కుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ బంక లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో హుస్నాబాద్ ఏసీపీ ఎస్. సదానందం సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ సదానందం మాట్లాడుతూ గ్రామ భద్రతకు సీసీ కెమెరాలు మూడో కన్నులా పనిచేస్తాయని, నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
యువత డ్రగ్స్, మత్తు పదార్థాలు, సైబర్ నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, గేమ్స్ వల్ల ఆర్థిక నష్టాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. సర్పంచ్ బంక లక్ష్మి మాట్లాడుతూ తోటపల్లి గ్రామం ఇకపై నిఘానేత్రం కింద ఉండబోతుందని తెలిపారు. కార్యక్రమంలో ఎస్త్స్ర పి. లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంక చందు, గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






