18 April, 2026 | 2:27 PM

విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి

13-05-2025 12:00 AM
  1. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలి  

జూన్ 2వరకు మరో వెయ్యి రైతువేదికల్లో దృశ్యశ్రావణ మాధ్యమాలు 

ఖరీఫ్ సాగు సన్నద్ధతపై అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష 

హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): వచ్చే ఖరీఫ్ సీజన్‌కు కార్యచరణ సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. యూరియా, విత్తనాల సరఫరాలో రైతులకు  ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూ చించారు. సచివాలయంలో సోమవారం వ్యవసాయాధికారులతో మంత్రి నిర్వహించిన సమీక్షలో మంత్రి తుమ్మల మాట్లా డుతూ ‘రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించడానికి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి. ప్రతి మండలంలో విత్తనాల సరఫరాను పర్యవేక్షించాలి.

ఖరీఫ్‌కు అవసరమైన వర్షాధార పంటల మార్గదర్శకాలు రూపొందించాలి’ అని సూచించారు. 2025- 26 ఖరీఫ్ కోసం 3.31 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను ఇప్పటికే భద్రపరచిన విషయాన్ని అధికారులు వివరించారు. ఈ నెలాఖరు వరకు మరో 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ను ముందస్తుగా తెప్పించుకొని, అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. మరో వెయ్యి రైతు వేదికలలో దృశ్యశ్రావణ మాధ్యమాలను ఏర్పాటు చేయాలని, జూన్ 2 వరకు సీఎం చేతుల మీదుగా ప్రారంభమయ్యేలా వాటి పనులు పూర్తిచేయాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశించారు.

అలాగే పత్తి కొనుగోళ్లపై వచ్చిన ఫిర్యాదులపై ఏర్పాటు చేసిన విజిలెన్స్ రిపోర్టు త్వరగా తెప్పించుకోవాలన్నారు. కొహెడ మార్కెట్ యార్డ్ పనుల గురించి కూడా మంత్రి తుమ్మల ఆరా తీశారు. కోర్టు సమస్యలను ఒక్కోటిగా పరిష్కరిస్తూ, గత పదేండ్లుగా ఎలాంటి ప్రమోషన్లు లేని వ్యవసాయ, అనుబంధ శాఖలలోని ఉద్యోగులకు పదోన్నతలు ఇచ్చినట్టు మంత్రి తెలిపారు.

ఇన్‌చార్జి పాలనలో నడిచిన యూనివర్సిటీలకు ఉప కులపతులను నియమించే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి, మార్కెటింగ్ డైరెక్టర్ సురేంద్రమోహన్, సీడ్ కార్పొరేషన్ ఎండీ శ్రీమతి యాస్మిన్ బాషా, వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ అల్దాస్ జానయ్య, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయ ఉపకులపతి రాజిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.