25 April, 2026 | 10:12 PM

భారీగా నల్ల బెల్లం పట్టివేత

25-04-2026 08:41 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం ఆదేశాల మేరకు ఎక్సైజ్ పోలీసులు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల పరిధిలోని మట్టేవాడ రహదారిలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా శుక్రవారం రాత్రి అశోక్ లేలాండ్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 1000 కిలోల నల్ల బెల్లం, 100 కిలోల పటిక, 20 లీటర్ల నాటు సారా, అశోక్ లేలాండ్ లారీ స్వాధీనం చేసుకున్నట్లు గూడూర్ ఎక్సైజ్ అధికారులు తెలిపారు.

గుడుంబా తయారీ కోసం ఉపయోగించే నల్ల బెల్లం, పటిక, గుడుంబా అక్రమ రవాణా కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ వరంగల్ టీమ్ కు రాబడిన విశ్వసనియమైన సమాచారం మేరకు ఇందిరా నగర్ తండా నుండి మట్టేవాడ దారిలో గత రాత్రి గస్తీ, వాహన తనిఖీలు చేయగా  అశోక్ లేలాండ్  వాహనంలో 1000 కేజీల నల్ల బెల్లం, 100 కేజీల పటిక, 20 లీటర్ల నాటు సార రవాణా చేస్తుండగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సిబ్బంది, వాహనం, అందులో గల నల్లబెల్లం, పట్టిక నాటుసారా స్వాధీన పరుచుకొని భూక్య వీరేందర్, గోగులోత్ రవీందర్ ఇద్దరు వ్యక్తులను  అదుపులోనికి తీసుకొని విచారించగా నల్లబెల్లం, పటిక ను కర్ణాటకలోని బీదర్ లో తక్కువ ధరకు తీసుకువచ్చి ఇందిరానగర్ తండా, చుట్టు పక్కల తండాలలో అధిక ధరకు విక్రయించి, వారివద్ద నుండి నాటు సారాను కొనుగోలు చేసి పట్టణాలలో  అమ్ముతూ ఉంటామని వచ్చిన లాభం ఇద్దరం సమానంగా పంచుకుంటాం అని నేరాన్ని అంగీకరించినట్లు చెప్పారు.

ఇక ఇదేవిధంగా ఎక్సైజ్ స్టేషన్ గూడూరు సిబ్బంది రాత్రి రూట్ వాచ్ నిర్వహించగా సర్వపురం తండా కు చెందిన భూక్య రమేష్ అనే వ్యక్తి నాటుసారా రవాణా చేస్తుండగా పట్టుకొని అతని వద్ద నుంచి ఆరు లీటర్ల నాటు సారా, ఒక ద్విచక్ర వాహనం ను స్వాధీనం తీసుకొని, కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ పోలీసు అధికారులు మాట్లాడుతూ నాటుసార విక్రయం, రవాణా, నాటుసారా తయారీ కోసం ఉపయోగించే ముడి పదార్థాలు రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అదే విధంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయించే వారిపైన, సేవించే వారిపైన ఎక్సైజ్ ప్రత్యేక బృందాలు నిఘా పెట్టాయని, వారిపైన కూడా చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు. ఈ దాడుల్లో సీఐ కే.నాగయ్య ఎస్ ఐ రజిత, హెడ్ కానిస్టేబుల్ బుచ్చయ్య, సత్యప్రసాద్, వరుణ్ రెడ్డి, గూడూరు ఎక్సైజ్ సిఐ ఎన్.బిక్షపతి, ఎస్ ఐ ఎస్ రాజేశ్వరి, సురేష్, వీరస్వామి, వెంకన్న, శ్రీను, సాయి, అభిలాష్, గద్దర్,బాగ్య పాల్గొన్నారు.