రాష్ట్రంలోనే వంద శాతం స్వీయ గణన పూర్తి చేసిన రెండవ గ్రామం సోమ్లా నాయక్ తండా
బాన్సువాడ డివిజన్ లో మొదటి గ్రామంగా రికార్డు
తహసిల్దార్ రాజ్ నరేందర్ గౌడ్ వెల్లడి
బాన్సువాడ,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని సోమ్లా నాయక్ తండా స్వీయ గణనలో విశేష విజయాన్ని సాధించింది. రాష్ట్రంలోనే వందశాతం స్వీయ గణన పూర్తి చేసిన రెండో గ్రామంగా, బాన్సువాడ డివిజన్ లోనే మొదటి గ్రామంగా సోమ్లా నాయక్ తండా రికార్డు సృష్టించింది. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచనల మేరకు మండల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామ ప్రజలకు స్వీయ గణనపై పూర్తి స్థాయి అవగాహన కల్పించారు.
దీనివల్ల గ్రామస్థులు ఉత్సాహంగా ముందుకు వచ్చి స్వీయ గణన ప్రక్రియను పూర్తిగా విజయవంతం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రాజ్ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ మండల, రెవెన్యూ, పంచాయతీ అధికారులు, ఉపాధ్యాయుల సమష్టి కృషి వల్లే ఈ విజయాన్ని సాధించగలిగామని తెలిపారు. మంగళవారం నాటికి గ్రామంలో వంద శాతం స్వీయ గణన పూర్తయిందని ఆయన వెల్లడించారు. గ్రామ ప్రజల చైతన్యం, అధికారుల కృషి కలిసొచ్చి సాధించిన ఈ విజయాన్ని స్థానికంగా అభినందిస్తున్నారు. ఇతర గ్రామాలకు ఇది ఆదర్శంగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు.






