17 July, 2026 | 4:46 PM

వారెవ్వా.. పైన మామిడి.. కింద గంజాయి

04-06-2024 03:39 AM

మణుగూరు , జూన్ 3:   మామిడికాయల మాటున గంజాయి రవాణా గుట్టురట్టు చేశారు మణుగూరు పోలీసులు. రూ1.19 కోట్ల విలువ గల గంజాయిని పట్టుకున్నారు. మణుగూరు ఎస్సై మేడ ప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మణుగూరు మీదుగా జహీరాబాద్‌కు రెండు వాహనాల్లో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు పట్టణంలోని హనుమాన్ గుడి వద్ద వాహన తనిఖీలు ప్రారంభించారు.

ఈ క్రమంలో మధ్యాహ్నం 3గంటల సమయంలో ఒక కారు, ఆ వెనకాలే మామిడికాయల ట్రాలీ తనిఖీల పాయింట్ వద్దకు చేరుకున్నాయి. వాటిని ఆపి సోదా చేయగా మామిడికాయల దిగువన గంజాయి లభించింది. ముందు ఉన్న పైలట్ వెహికిల్‌గా గుర్తించారు. కారులో ఉన్న ఇద్దరిని, ట్రాలీలో ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేశారు.  గంజాయితోపాటు వాహనాలను సీజ్  చేశారు. 

డొంకరాయి నుంచీ...

రెండు వాహనాల్లో ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించగా గంజాయి రవాణా చేస్తున్నట్లు అంగీ కరిం చినట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు. డొంకరాయిలో సరుకు కొనుగోలు చేసి, అక్కడి నుంచి అశ్వాపురం, మణుగూరు మీదుగా జహీరాబాద్‌కు తరలిస్తున్నట్లు విచారణలో తేలినట్లు చెప్పారు.

అరెస్టయిన వారిలో యాదాద్రి జిల్లా భువనగిరి మండలం గొల్లపల్లికి చెందిన చెరుకుపల్లి శ్రీకాంత్, గుమ్మడెల్లి అర్జున్, మోతుగ్గూడెం, పొల్లూరుకు చెందిన పంగి సునీల్ కుమార్, ఇల్లెందు మండలం రొంపెడుకు చెందిన రాయకంటి నాగరాజు, అదే ప్రాంతానికి చెందిన ఎజ్జు సృజన్ ఉన్నారు. జహీరాబాద్‌కు చెందిన అర్జున్, కిరణ్ సూచన మేరకు డొంకరాయి ప్రాంతానికి చెందిన రవి, మధు, ఉపేందర్, పంగి గురు వద్ద గంజాయి కొన్నారని తెలిపారు.