25 June, 2026 | 2:30 AM

టేకులపల్లిలో ‘ఎస్‌ఐఆర్’ అవగాహనపై సదస్సు

25-06-2026 01:13 AM

45 పోలింగ్ బూత్లకు బిఎల్‌ఏల నియామకం తప్పనిసరి

టేకులపల్లి, జూన్ 24,(విజయక్రాంతి): టేకులపల్లి మండలంలో జూన్ 25 నుంచి జూలై 24 వరకు నెల రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - ప్రత్యేక ఓటర్ల జాబితా తీవ్ర సవరణ) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టేకులపల్లి తహసిల్దార్ వీరభద్రం పిలుపునిచ్చారు. బుధవారం టేకులపల్లి తహసిల్దార్ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో మండలంలోని వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులకు, బూత్ స్థాయి ఏజెంట్లకు (బిఎల్‌ఏ - BLA) ఒక ప్రత్యేక అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ కార్యక్రమ ప్రాధాన్యతను, ఎన్నికల సంఘం నిబంధనలను ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమగ్రంగా వివరించారు. బిఎల్‌ఏల నియామకానికి కఠిన నిబంధనలు ఈ సమావేశంలో తహసిల్దార్ వీరభద్రం మాట్లాడుతూ.. మండలంలోని మొత్తం *45 పోలింగ్ బూత్లకు* గాను ప్రతి రాజకీయ పార్టీ ఒక్కో బూత్కు తప్పనిసరిగా ఒక బిఎల్‌ఏ (Booth Level Agent)ను నియమించాలని స్పష్టం చేశారు. అయితే ఈ నియామకాల్లో ఎన్నికల సంఘం నిబంధనలను ఖచ్చితంగా పాటించాలన్నారు.

స్థానికత నియమించబడే బిఎల్‌ఏ ఖచ్చితంగా ఆయా సంబంధిత పోలింగ్ కేంద్రంలోనే ఓటరై ఉండాలి. ఉద్యోగ నిబంధన: ప్రభుత్వ ఉద్యోగులెవరూ బిఎల్‌ఏలుగా ఉండటానికి వీల్లేదు. రాజకీయ పార్టీలు నియమించే బిఎల్‌ఏలు, ప్రభుత్వ యంత్రాంగం తరఫున పనిచేసే బిఎల్‌ఓలకు (Booth Level Officers) పూర్తి స్థాయిలో సహకరిస్తూ, క్షేత్రస్థాయిలో ఎస్‌ఐఆర్ కార్యక్రమం విజయవంతం అయ్యేలా బాధ్యతాయుతంగా కృషి చేయాలని ఆయన కోరారు.

విధివిధానాలు, నియమ నిబంధనలను పాటిస్తూ.. బిఎల్‌ఓలు, బిఎల్‌ఏలు సమన్వయంతో వ్యవహరించి ఓటర్లకు అవగాహన కల్పించాలని, టేకులపల్లి మండలంలో ఈ ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని నూటికి నూరు శాతం విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సమావేశంలో మండలంలోని వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, ప్రతినిధులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.