సీనియర్ అధికారి బుర్రా వెంకటేశంకు టీజీపీఎస్సీ చైర్మన్ పదవి
- స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో పదవీ విరమణ
- డిసెంబర్ 2 లేదా 3న టీజీపీఎస్సీ బాధ్యతల స్వీకరణ
- 2030 వరకు పదవిలో కొనసాగనున్న బుర్రా
హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): టీజీపీఎస్సీ ప్రక్షాళనపై రేవంత్‌రెడ్డి సర్కార్ దృష్టిసారిం చింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో స్వచ్ఛంద పదవీ విరమణ చేయనున్నారు. ఆయనకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదా కల్పిస్తూ సీఎస్ శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత ఆయన డిసెంబర్ ౨ లేదా ౩న టీజీపీఎస్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత చైర్మన్ మహేందర్‌రెడ్డి పదవీకాలం డిసెంబర్ 2న ముగియనుంది.
దీంతో కొత్త చైర్మన్ నియామకం కోసం నోటిఫికేషన్‌ను జారీచేసి నవంబర్ 20 వరకు దరఖాస్తులను స్వీకరించింది. విశ్రాంత ఐఏఎస్‌లు, వివిధ వర్సిటీల ప్రొఫెసర్ల నుంచి దాదాపు 45 దరఖాస్తులు వచ్చాయి. వీరిలో బుర్రా వెంకటేశం పేరును సిఫార్సు చేస్తూ ప్రభుత్వం గవర్నర్‌కు ఫైల్‌ను పంపింది.
దీనికి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. వెంకటేశంకు మరో నాలుగేళ్ల పదవీ కాలం ఉండగానే వీఆర్‌ఎస్ తీసుకున్నారు. 2030 వరకు ఆయన టీజీపీఎస్సీ చైర్మన్‌గా కొనసాగనున్నారు. ప్రభుత్వం మొదటి నుంచి పూర్తిస్థాయి ఆరేళ్ల చైర్మన్‌ను నియమించాలని భావించింది. ఈ క్రమంలోనే బుర్రా వెంకటేశంను ఎంపిక చేసింది.
నిరు పేద కుంటుంబం నుంచి..
సీనియర్ అధికారి అయిన బుర్రా వెంకటేశం జనగాం జిల్లా ఓబుల్ కేశవాపురానికి చెందినవారు. 1968 ఏప్రిల్ 10న గౌరమ్మ, నారాయణగౌడ్ దంపతులకు నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సర్వేల్ గురుకులంలో తన పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేశారు. ప్రభుత్వ పాఠశాలలోనే పదో తరగతి పూర్తి చేసిన ఆయన ఇంటర్మీడియట్ కోసం హైదరాబాద్ వచ్చారు. ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ చేస్తూ షేక్‌పేట్ పరిధిలో హోమ్ ట్యూషన్స్ చెప్తూ విద్యాభ్యాసం సాగించారు. 1990లో మొదటి అటెంప్ట్‌లోనే సివిల్స్ రాసి సెంట్రల్ ఎక్సుజ్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం సాధించారు. 1995లో మరోసారి సివిల్స్ రాసి జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు సాధించారు.
వివిధ హోదాల్లో సమర్థంగా..
1996లో ఆదిలాబాద్ జిల్లా ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్‌గా బుర్రా వెంకటేశం ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లో వివిధ జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేసిన ఆయన.. తెలంగాణ ఏర్పడిన తర్వాత హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యారు. గత ప్రభుత్వ హయాంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన వెంకటేశం, ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా, రాష్ర్ట గవర్నర్‌కు ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహస్తున్నారు.
రచయితగానూ అనుభవం
ఐఏఎస్‌గా వివిధ హోదాల్లో పనిచేసిన బుర్రా వెంకటేశం.. పుస్తకాలు, పాట లు కూడా రాశారు. ఆయన రాసిన సెల్ఫీ ఆఫ్ సక్సెస్ ఇంగ్లిష్ పుస్తకం, గెలు పు పిలుపు వంటివి ప్రాచుర్యం పొందా యి. బతుకమ్మతోపాటు తల్లిదండ్రుల గొప్పతనాన్ని వివరించే ‘అమ్మ గీసీన బొమ్మను నేను’ అనే అద్భుతమైన పాటలు రాశారు. నిరుపేద కుంటుంబం నుంచి వచ్చిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన టీజీపీఎస్సీ చైర్మన్‌గా ఎంపిక కావడంతో విద్యావేత్తలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.




