8 April, 2026 | 9:36 PM

నేడు బీజేపీ ఛార్జిషీట్

01-12-2024 02:33 AM
  1. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై..
  2. ప్రభుత్వ వైఫల్యాలపై 6న సరూర్‌నగర్‌లో బహిరంగ సభ
  3. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కొత్త వారికి అవకాశం 
  4. తెలంగాణలో బీజేపీకి ఉజ్వల భవిష్యత్తు
  5. సంస్థాగత వర్క్ షాప్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై ఛార్జ్‌షీట్ రూపకల్పన చేసి ఆదివారం ప్రజల ముందు పెడుతున్నామని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గాలు, జిల్లాల వారీగా ప్రభుత్వం తీరును ఎండగడతామని చెప్పారు.

ఇందుకు పార్టీ కార్యకర్తలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బీజేపీ సంస్థాగత ఎన్నికల వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ ప్రభుత్వ పాలననే కాంగ్రెస్ సర్కారులోనూ చూస్తున్నా మన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై డిసెంబర్ 6న సరూర్‌నగర్ స్టేడియంలో బీజేపీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని, ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా లేదా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారని అన్నారు.

పదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం నాశనం అయ్యిందని, ఇప్పుడు  కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తోందని ఆయ న దుయ్యబట్టారు. గత పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాలేదన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. 

తెలంగాణకు అండగా మోదీ 

తెలంగాణ అభివృద్ధి కోసం మోదీ ప్రభు త్వం అండగా నిలబడుతోందని కిషన్‌రెడ్డి అన్నారు. జాతీయ రహదారులు, రైల్వేల అభివృద్ధి కోసం కేంద్రం అనేక సహకారాలు అంది స్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా జీపీలకు నిధులివ్వడం లేద ని, 15వ ఫైనాన్స్ నిధులతోనే జీపీలకు నిధులు అందుతున్నాయన్నారు.

రాష్ర్టంలోని అన్నివర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని తెలిపా రు. రానున్న రోజుల్లో ప్రజలను సంఘటితం చేసి ఉద్యమబాట పట్టాలని, ఆ దిశగా పార్టీ కార్యక్రమాలు రూపకల్పన చేయాలన్నారు. రాష్ర్ట ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

ఇప్పటివరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్‌లను ప్రాసెస్ చేసి తామే ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఏడాది గడిచినా రుణమాఫీ పూర్తిచేయలేదన్నారు. వృద్ధులు, వితంతువులకు రూ.4,000 పెన్షన్,  ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని మండిపడ్డారు. 

బీజేపీ కుటుంబ పార్టీ కాదు

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల లాగా బీజేపీ కుటుంబం అధారంగా నడిచే పార్టీ కాదని ఆయన పేర్కొన్నారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు కొత్త కమీటీలు రాబోతున్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇకపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా పార్టీలో కొత్త రక్తం నాయకత్వం వహించబోతోందని తెలిపారు. ఇటీవల రాష్ర్ట ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రధాని మోదీని కలిసినప్పడు తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని, ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని సూచించారని తెలిపారు.

కేంద్రం తరఫున తెలంగాణ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం అన్ని ర కాలుగా అండగా నిలబడుతామని మోదీ స్ప ష్టంగా చెప్పారన్నారు. సమావేశంలో తెలంగా ణ బీజేపీ ఇన్‌చార్జి సునీల్ బన్సల్, జాతీయ కార్యదర్శి అర్వింద్ మేనన్, తెలంగాణ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి అభయ్ పాటిల్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ, ఎంపీలు, ఎమ్మె ల్యేలు, పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. 

కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతాం..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన వైఫల్యాలను ఎండగడుతూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఛార్జిషీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరుకానున్నారు. సోమాజిగూడలోని హోటల్ కత్రియాలో మధ్యాహ్నం 1.30కు ప్రత్యేకంగా సెమినార్ ఏర్పాటు చేసినట్లు బీజేపీ మీడియా ఇన్‌ఛార్జి ఎన్వీ సుభాష్ తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ వైఫల్యాలపై పూర్తి చర్చ జరుగుతుందని ఆయన అన్నారు.

 పట్టు వదలకుండా ముందుకు సాగాలి 

 పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన అద్భుత ఫలితాల మాదిరిగానే భవిష్యత్తులోనూ పార్టీ విజయం సాధించాలని పార్టీ శ్రేణులకు బీజేపీ ముఖ్య నేతలు సూచించినట్లు సమాచారం. శనివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సంస్థాగత ఎన్నికల వర్క్‌షాపునకు తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జి సునీల్ బన్సల్, బీజేపీ జాతీయ కార్యదర్శి అర్వింద్ మేనన్, తెలంగాణ సభ్యత్వ నమోదు ఇన్‌ఛార్జి అభయ్ పాటిల్ హాజరయ్యారు.

రాష్ట్రం నుంచి కేంద్ర పార్టీ ఏం ఆశిస్తుందో ఈ నేతలు సమావేశంలో స్పష్టం చేసినట్లు సమాచారం. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి చాలా చక్కగా ఉందని, ఇదే టెంపోను కొనసాగిస్తూ రాబోయే స్థానిక సంస్థలు, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లుగా అధిష్ఠానం ఆశిస్తోందని వారు వెల్లడించినట్లు తెలుస్తోంది.

దూకుడుగా వెళ్లే యువతకు, నేతలకు అవకాశాలు కల్పించాలని కోరినట్లు సమాచారం.ఈసారి గతంలో ఎప్పుడు లేనివిధంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియను సైతం నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 10 వరకు సభ్యత్వ నమోదు ప్రక్రియను ఇంకా కొనసాగించాలని, పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించాలని వర్క్‌షాపులో చర్చించారు.