12 June, 2026 | 2:00 AM

క్రీడలు లేవు.. ప్రాంగణాలు లేవు..

12-06-2026 12:26 AM

ఎక్కడబడితే అక్కడ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు..

బోర్డులు ఏర్పాటు చేశామా.. బిల్లులు లేపామా..

అన్న రీతిగా వ్యవహారం..

తాడ్వాయి, జూన్, 11 (విజయక్రాంతి): గ్రామాల్లోని క్రీడాకారులను వెలికి తీయాలనే సంకల్పంతో గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల నిర్మాణాలకు అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామాలలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి క్రీడలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావించింది. గ్రామీణ క్రీడాకారులను సైతం రాష్ట్రస్థాయిలో, జాతీయస్థాయిలో రాణించేటట్లు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ప్రత్యేకంగా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది.

కానీ అధికారులు నిర్లక్ష్యం కారణంగా క్రీడా ప్రాంగణాలు అనువైన ప్రాంతాల్లో ఏర్పాటు చేయకుండానే బోర్డులు పెట్టేశారు. బోర్డులు పెట్టిన ప్రాంతంలో క్రీడలకు ఉపయోగపడేలా భూమిని చదును చేయలేదు. అలాగే వదిలేసి బోర్డులు పెట్టేశారు. ప్రస్తుతం చాలా గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు లేవు. క్రీడ ప్రాంగణాలు అన్న రీతిగా వ్యవహారం ఉంది. కామారెడ్డి జిల్లా లో ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణాలు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి.

క్రీడలకు అనువైన మైదానాలలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తే అక్కడ క్రీడలకు అనువుగా ఉండేది. కానీ ఎక్కడబడితే అక్కడ క్రీడా ప్రాంగణాలకు బోర్డులు పెట్టడంతో ఆ ప్రాంగణాలు ఉపయోగకరంగా లేకుండా పోయాయి. తాడువాయి మండలంలో నిర్మించిన క్రీడా ప్రాంగణాలు ఉపయోగకరంగా లేకుండా పోయాయి. చాలా గ్రామాలలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నామ్ కె వాస్తేగా  ఉన్నాయి.కొన్నిచోట్ల గతంలో ఉన్న క్రీడా మైదానాలలోనే క్రీడా ప్రాంగణం బోర్డులు ఏర్పాటు చేయగా, మరికొన్ని చోట అనువుగాని చోట్ల బోర్డులు పెట్టేసి క్రీడా మైదానాలుగా చిత్రీకరించారు.

వ్యవసాయ భూముల్లో క్రీడా ప్రాంగణం బోర్డు ఏర్పాటు..

తాడ్వాయి మండలంలోని పల్లె గడ్డ తండాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఎదురుగా క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. క్రీడా ప్రాంగణం బోర్డు పెట్టారు. కానీ అక్కడ క్రీడలకు అవసరమైన మైదానమే లేదు. సదరు అధికారులు బోర్డు పాతి వెళ్ళిపోయారు. అక్కడ క్రీడలు ఆడుతున్నారా లేదా అనే విషయం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం క్రీడా ప్రాంగణం ఉన్న బోర్డు వెనకాల వ్యవసాయ పొలాలు ఉన్నాయి. పక్కనే నివాసపు ఇల్లు ఉంది.

అక్కడ మైదానానికి అవసరమైన స్థలమే లేదు. కానీ అక్కడ బోర్డు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కారు. ప్రభుత్వ ఉద్దేశాన్ని గాలికి వదిలేశారు. మైదానాలు ఏర్పాటు చేసి క్రీడలను అభివృద్ధి చేయాలని భావించిన ప్రభుత్వానికి అధికారులు కుచ్చుటోపి పెట్టారు. తాడ్వాయి మండల కేంద్రంలో సైతం ఉన్న క్రీడా మైదానానికి క్రీడా ప్రాంగణంగా చిత్రీకరించి బోర్డ్ ను నెలకొల్పారు.

ఒక్కో క్రీడా ప్రాంగణానికి లక్షల ఖర్చు..

ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు కోసం లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసింది. ఒక్కో క్రీడా ప్రాంగణానికి రూ. 2 లక్షల నుంచి రూ.3.50 లక్షల వరకు ఎంబి రికార్డులు చేసుకుని బిల్లును పొందారు. కానీ ప్రస్తుతం ఆ క్రీడా ప్రాంగణాలు ఉపయోగకరంగా లేకుండా పోయాయి. యువకులు, విద్యార్థులు గతంలో ఎక్కడ మైదానాలను ఉపయోగించుకున్నారో అక్కడే ఆడుకుంటూ క్రీడల్లో తర్ఫీదు పొందుతున్నారు. 

పర్యవేక్షణ లేకపోవడంతోనే..

క్రీడ ప్రాంగణాలను ఏర్పాటు చేసే సమయంలో సరైన అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే ఎక్కడపడితే అక్కడ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి డబ్బులను వృధా చేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం క్రీడా ప్రాంగణాలు బోర్డులకే పరిమితం అయ్యాయని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎక్కడెక్కడ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశారో అక్కడక్కడ మైదానాలను చదును చేసి క్రీడలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని యువకులు కోరుతున్నారు.