ఎఫ్‌డీలపై 7 శాతం వడ్డీ
ఆఫర్ చేస్తున్న బ్యాంకులివే
సురక్షితమైన మదుపు సాధనంగా చూసే ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) వేసే ముందు కాస్త ఎక్కువ వడ్డీ ఎక్కడ వస్తుందో చూసుకోవడం సహజం. అన్ని బ్యాంక్‌ల్లోనూ వడ్డీ రేట్లు దాదాపు ఒకే శ్రేణిలో ఉన్నా, కొద్దిపాటి తేడాలుంటాయి. రేటు కాస్త అధికం ఉంటే చాలు..దీర్ఘకాలంలో మనకు కలిసొచ్చేది చాలా ఉంటుంది. మరి.. ఫిక్స్‌డ్‌పై 7 శాతంపైన వడ్డీ రేటును ఆఫర్ చేసే బ్యాంకులేమిటో చూద్దామా!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
వివిధ కాలపరిమితుల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఎస్‌బీఐ ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్లు 3.50 శాతం నుంచి 7 శాతం శ్రేణిలో ఉన్నాయి. 2 నుంచి 3 ఏండ్ల కాలపరిమితిలో గల ఎఫ్‌డీలకు 7 శాతం గరిష్ఠ వడ్డీ రేటు లభిస్తున్నది. 1 ఏండ్ల ఎఫ్‌డీలపై 6.80 శాతం వడ్డీ రేటు ఉన్నది. 2023 డిసెంబర్ 27 నుంచి ఈ రేట్లు అమలవుతున్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
ఈ బ్యాంక్‌లో వేసే కొన్ని కాలపరిమితుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.25 శాతం వరకూ వడ్డీ రేటు అందిస్తున్నది. 18 నెలల 21 రోజుల టెర్మ్ డిపాజిట్‌పై 7.25 శాతం గరిష్ఠ వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నది. ఈ బ్యాంక్‌లో చేసే ఎఫ్‌డీలకు 4 ఏండ్ల 7 నెలల నుంచి 55 నెలల డిపాజిట్లకు 7.20 శాతం, 2 ఏండ్ల 11 నెలల నుంచి 35 నెలల వరకూ 7.15 శాతం చొప్పున వడ్డీ రాబడి లభిస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి ఈ రేట్లు అమల్లోకి వచ్చాయి.
ఐసీఐసీఐ బ్యాంక్
వివిధ కాలపరిమితుల ఎఫ్‌డీలకు ఐసీఐసీఐ బ్యాంక్ 3 శాతం నుంచి 7.20 శాతం వరకూ వడ్డీ రేటు ఆఫర్ చేస్తున్నది. 15 నెలల నుంచి 2 ఏండ్ల కాలపరిమితిగల డిపాజిట్‌పై అధికంగా 7.20 శాతం వడ్డీ ఇస్తుంది. 2 నుంచి 5 ఏండ్ల ఎఫ్‌డీకి 7 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తుండగా, 5 ఏండ్లకుపైబడి చేసే డిపాజిట్‌కు మాత్రం వడ్డీ రేటును 6.90 శాతమే ఇస్తున్నది. ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి ఈ రేట్లు అమలవుతున్నాయి.
బ్యాంక్ ఆఫ్ బరోడా
ఈ బ్యాంక్ వివిధ కాలపరిమితులుగల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.25 శాతం 7.25 శాతం మధ్య వడ్డీ రేటు ఇస్తున్నది. 7.25 శాతం గరిష్ఠ వడ్డీ రేటు 2 ఏండ్ల మధ్య కాలపరిమితికి చేసే ఎఫ్‌డీపై లభిస్తుంది. 399 రోజుల బరోడా తిరంగా ప్లస్ డిపాజిట్ స్కీమ్ 7.15 శాతం వార్షిక వడ్డీని అందిస్తుంది. తాజా వడ్డీ రేట్లు 2024 జనవరి 15 నుంచి అమల్లోకి వచ్చాయి.
కొటక్ మహీంద్రా బ్యాంక్
ఈ బ్యాంక్ వివిధ కాలపరిమితుల ఎఫ్‌డీలపై అందించే వడ్డీ రేట్లు 2.75 శాతం నుంచి 7.40 శాతం శ్రేణిలో ఉన్నాయి. 7.40
శాతం గరిష్ఠవడ్డీ రేటు 390 రోజుల నుంచి 23 నెలల లోపు డిపాజిట్‌పై లభిస్తుంది. 23 నెలల నుంచి 2 ఏండ్లలోపు డిపాజిట్‌పై
7.30 శాతం వడ్డీ వస్తుంది. 2024 ఫిబ్రవరి 27 నుంచి ఈ రేట్లు అమల్లోకి వచ్చాయి.






