13 June, 2026 | 1:19 AM

ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు..?

13-06-2026 12:15 AM
  • పని వేళల్లోనూ మూలఖథ్ కొరకు సామాన్యులు, రైతులకు ఆంక్షలు
  • మీటింగుల పేరుతో కార్యాలయాల్లో గంటల తరబడి చర్చలు
  • భూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో తీవ్ర అలసత్వం 
  • ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఉన్నతాధికారుల ముందే జంటగా గుసగుసలు
  • ఫిర్యాదులందినా తెర వెనుక సహకరిస్తున్న ప్రజా ప్రతినిధి ఎవరు.?

నాగర్ కర్నూల్ జూన్ 12 (విజయక్రాంతి): ఆ ఇద్దరూ ఉన్నతమైన హోదా కలిగిన ప్రభుత్వ ఉద్యోగులే... కానీ తనకన్నా తక్కువ వయసున్న కిందిస్థాయి ఉద్యోగితో అత్యంత చనువుగా విమర్శకు దారి తీసేలా కనిపిస్తున్నారు. ఉద్యోగ రీత్యా పని వేళల్లోనూ ప్రభుత్వ పథకాలు ఇతర మీటింగ్ పేరుతో కార్యాలయాల్లోనే ఆ ఇద్దరూ గంటల తరబడి గుసగుసలాడుతూ కార్యాలయంలోని సిబ్బంది కంట పడుతున్నారు.

ఆ సమయంలో రైతులు, విద్యార్థులు ఇతర సామాన్యులు వారిని కలిసేందుకు వెళితే మాత్రం ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ మండలంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియలోనూ తాపీగా సాయంత్రం ప్రారంభిస్తూ అర్ధరాత్రి వరకు కొనసాగించడంతో సుదూర ప్రాంతాల నుండి వచ్చే క్రయ విక్రయదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రస్థాయి మంత్రుల పర్యటన, ఇతర కార్యక్రమాలు జరిగిన సమయంలోనూ ఆ ఇద్దరే ప్రత్యేకంగా ఒక చోట వేరుగా కనిపిస్తుండడంతో ఆ ఇద్దరి వ్యవహార శైలి పట్ల జిల్లాలో తీవ్రస్థాయి చర్చలు జరుగుతున్నాయి.

వారి పరిధిలోని ప్రభుత్వ భూములు కాపాడాల్సింది పోయి కబ్జా కోరుల బారిన పడుతున్నాయని ఫిర్యాదులు అందినా పట్టింపు లేకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. అక్రమంగా మట్టి, ఇసుక తరలి పోతున్నా పట్టించుకున్న పరిస్థితి శూన్యం. ఆ ఇద్దరి పరిధిలోని పెండింగ్ ఫైల్స్ గుట్టలుగా పేరుకు పోతున్నా పట్టించుకోకపోవడం శోచనీయం. ఈ వ్యవహారాలన్నీ తెలిసిన కొంతమంది ద్వితీయ శ్రేణి పొలిటికల్ నేతలు వీక్నెస్ పాయింట్ తమకు అనుకూలంగా మార్చుకొని అనుకూలమైన పనులను చేసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి.

రెవిన్యూ అధికారులు ప్రభుత్వ భూమి అంటూ బ్యానర్ ఏర్పాటు చేసిన భూమిని సైతం తిరిగి కబ్జా అవుతున్నా ఆ అధికారులకు పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో అనుమానాలకు మరింత బలం చేకూరుతున్నాయి. ఈ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదులు అందినప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడం వెనక ముఖ్యమంత్రికి అతి చేరువగా ఉండే ఓ ప్రజా ప్రతినిధి ఆ అధికారులకు తెర వెనుక సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది. ఈ విషయం పట్ల ఆ ఇరువురి అధికారులను ఫోన్ లైన్‌లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.