08-10-2025 12:17:07 AM
నల్లగొండ క్రైమ్, అక్టోబర్ 7: ప్రేమ పేరుతో బాలికను నమ్మించి, తన గదికి తీసుకెళ్లిన యువకుడు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి, ఫిట్స్ రావడంతో బాలిక మృతిచెందింది. ఈ ఘటనం నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది. నల్లగొండ పట్టణ సమీపంలోని ఓ గ్రామానికి బాలిక నల్లగొండలోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది.
స్వగ్రామం నుంచి కళాశాలకు రోజు వచ్చి పోతున్నది. గుట్టకింది అన్నారం గ్రామానికి చెందిన గడ్డం కృష్ణ గత 6 నెలలుగా ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. మంగళవారం కృష్ణ స్నేహితుడు బాలిక కళాశాల వద్దకు ఆటోలో వెళ్లి, ఆమెను పట్టణంలో తాను అద్దెకు ఉంటున్న గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడే ఉన్న గడ్డం కృష్ణ బాలికపై లైంగిక దాడి చేయడంతో.. తీవ్ర రక్తస్రావం జరిగి, ఫిట్స్ వచ్చి బాలిక మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.
బాలిక మృతి చెందిన వెంటనే కృష్ణ పెద్ద మనుషులకు సమాచారం ఇవ్వగా, వారు పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. నల్లగొండ టూ టౌన్, వన్ టౌన్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. ఘటన స్థలాన్ని ఎస్పీ శరత్‌చంద్ర పవార్, శివరాంరెడ్డి వన్ టౌన్ సిఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ సైదులు పరిశీలించారు. బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, గడ్డం కృష్ణతోపాటు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.