08-10-2025 12:15:48 AM
మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్
మరిపెడ, అక్టోబర్ 7 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపం లాంటిదని, స్థానిక ఎన్నికల్లో డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటమి ఖాయమని మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా భార్గవ ఫంక్షన్ హాల్లో గ్రంధాల సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు అధ్యక్షతన జరిగిన బిఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో రెడ్య నాయక్ మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల వలె శక్తి వంచన లేకుండా పనిచేసి మరిపెడ మండలంలో ఎంపీపీ, జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచులను గెలిపించుకోవాలన్నారు.
డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ హాయంలో ఎమ్మెల్యే రామచందృ నాయక్ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టడం లేదని, తన సొంత పనుల కోసం మూడు నెలలకు ఒకసారి ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో డోర్నకల్ ప్రజలకు ఎందుకు గెలిపించామని బాధపడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఊసురు పోసుకుంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వల్ల డోర్నకల్ నియోజకవర్గంలోని ఏడు మండలాలలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఎంపీపీ, జడ్పిటిసి స్థానాల్లో భారీ మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఓ డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డి, బిఆర్‌ఎస్ నాయకులు అచ్యుతరావు, మాజీ ఎంపీపీ వెంకన్న, రాంబాబు, రవీందర్ నాయక్, శాస్త్రి, శ్రీనివాస్, కాలు నాయక్, సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు , మాజీ గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ గ్రామ పార్టీ యూత్ నాయకులు,బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.