17-07-2025 12:51:00 AM
వైద్య ఆరోగ్యశాఖ తనిఖీలతో బెంబేలు
మహబూబాబాద్, జూలై 16 (విజయ క్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిరాని, స్థాయికి మించిన వైద్యం చేస్తూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్న శంకర్ దాదా ఎంబిబిఎస్ మాదిరిగా చలామణి అవుతున్న కొందరు గ్రామీణ వైద్యులపై వైద్య ఆరోగ్యశాఖ కొరడా ఝళిపిస్తోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, టాస్క్ ఫోర్స్ అధికారులు ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తున్న ఆర్.ఎం.పిలకు చెందిన వైద్యశాలలను సీజ్ చేస్తున్నారు.
ప్రధమ చికిత్సకు మాత్రమే పరిమితం కావాల్సిన ఆర్‌ఎంపీలు గ్రామాల్లో ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని స్థాయికి మించి వైద్యం చేస్తున్నారు. ఇక కొందరైతే ఏకంగా గ్రామాల్లో ఎంబీబీఎస్ స్థాయి డాక్టర్లు నిర్వహించే తరహాలో క్లినిక్ లు, వైద్యశాలలు ఏర్పాటు చేయడం విశేషం. ఇందులో ప్రజలకు ఇంజక్షన్ వేయడం, స్లున్ బాటిల్ ఎక్కించడం, యాంటీ బాటిక్ , ఇతర మందులు ఇవ్వడం చేస్తున్నారు.
దీనితో పలుమార్లు వారు చేస్తున్న వైద్యం వికటించి అనేకమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎంపీలు కొందరు వచ్చిరాని వైద్యం చేయడంతో పాటు, స్థాయికి మించి ప్రవర్తించడం, పెద్ద రోగం నయం కోసం తాము చెప్పిన వైద్యుడు దగ్గరికి వెళ్లాలని హుకుం జారీ చేయడం, తదితర చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల పెట్రేగిపోతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. అక్రమ వ్యవహారాలకు పాల్పడుతూ దండిగా సంపాదిస్తుండడంతో నిజాయితీగా వైద్యం చేసే మరి కొందరు ఆర్‌ఎంపీలు కూడా వీరి దారిలో పయనించే పరిస్థితి ఏర్పడింది.
పెద్దాసుపత్రులకు బ్రాండ్ అంబాసిడర్ ను ఆర్‌ఎంపీలు
గ్రామాల్లో పేద ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యం చేస్తున్నారనే నమ్మకాన్ని కలిగించి, పెద్ద రోగం ఏదైనా వస్తే నాకు తెలిసిన ఫలానా పెద్ద ఆసుపత్రికి వెళితే తక్కువ ఖర్చుతో రోగం నయమవుతుందని నమ్మబలికి అక్కడికి వెళ్లేలా కొందరు ఆర్‌ఎంపీలు పెద్ద ఆస్పత్రులకు రెఫర్ చేస్తూ తమ వంతు వాటా దండుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. వీరు పంపిన ఆసుపత్రికి పేషెంట్లు వెళితే వారు వేసే బిల్లులో కొంత పర్సంటేజీ ఇవ్వడంతో పాటు, వైద్య పరీక్షలకు సంబంధించిన బిల్లుల్లో కూడా కొంత ఆర్‌ఎంపీలకు ముట్ట చెబుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పేద ప్రజల నమ్మకాన్ని కొందరు ఆర్‌ఎంపీలు ఈ విధంగా ‘వమ్ము’ చేస్తూ ’సొమ్ము’ చేసుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
లింగ నిర్ధారణకు చేయూత..?
ఇక మరికొందరు ఆర్‌ఎంపీలు గర్భిణీలకు లేనిపోని మాయమాటలు చెప్పి పుట్టబోయే బిడ్డ ఆడో..మగో తెలుపుతామంటూ తమకు తెలిసిన వైద్యుడి వద్దకు పంపి లింగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నట్లు ఆరోప ణలు వస్తున్నాయి. ఇటీవల వరంగల్ జిల్లాలోని నెక్కొండ స్కానింగ్ సెంటర్లో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఓ ఆర్.ఎం.పి బాగోతం వెళ్లడయ్యింది. లింగ నిర్ధారణ పరీక్షల కోసం వచ్చే వారి నుండి పదివేల నుంచి 30 వేల వరకు దండుకుంటున్న స్కానింగ్ సెంటర్లు, తమకు రెఫర్ చేసే ఆర్‌ఎంపీలకు కొంత ముట్ట చెబుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇలా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కూడా కొందరు ఆర్‌ఎంపీలు పాల్పడడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
శిక్షణ, అవగాహన పెంపొందించాలి
గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేసే ఆర్‌ఎంపీలు కేవలం ప్రధమ చికిత్స కు మాత్రమే పరిమితం చేసేలా ప్రభుత్వం వారికి అవగాహన కల్పించడంతోపాటు, సరైన శిక్షణ ఇవ్వాలి. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్‌ఎంపీలకు ప్రథమ చికిత్సలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించడానికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి, ఫస్ట్ ఎయిడ్ చేసే విధంగా వారికి వైద్య ఆరోగ్యశాఖ నుంచి గుర్తింపు పత్రాలను కూడా అందజేశారు.
ఒక దశ శిక్షణ పూర్తయిన నేపథ్యంలో మలిదశ శిక్షణ చేపట్టే సమయానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విమాన ప్రమాదంలో దుర్మరణం కావడంతో ఆ కార్యక్రమం కాస్త ఆటకెక్కింది. తాజాగా మళ్లీ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ఆర్‌ఎంపీలకు ఫస్ట్ ఎయిడ్ చికిత్సకు మాత్రమే పరిమితం అయ్యేలా శిక్షణ ఇచ్చి, ధ్రువీకరణ పత్రాలు ఇస్తే కొంత పరిస్థితుల్లో మార్పు వస్తుందని చెబుతున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, కొందరు తప్పు చేస్తే అందరిని ఒకే గాటిన కట్టి నిందించడం సరికాదని ఆర్‌ఎంపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.