12 May, 2026 | 1:46 AM

నగల సంస్థల షేర్లు డమాల్

12-05-2026 01:02 AM
  1. ఒక్కరోజే 35,000 కోట్ల సంపద ఆవిరి 
  2. ప్రధాని బంగారం కొనొద్దన్న వ్యాఖ్యల ప్రభావం
  3. దేశంలో ఇంధన కొరత లేదని కేంద్ర పెట్రోలియం శాఖ ప్రకటన 
  4. కేంద్రం వైఫల్యాలను ప్రజలపై నెట్టే ప్రయత్నం: రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ, మే ౧౧: విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకునేందుకు ఆదివారం హైదరాబాద్ వేదికగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు ఉద్బోధించిన పొదుపు మంత్రం మార్కెట్లపై ప్రభావం చూపింది. వినియోగదారులు ఏడాదిపాటు బంగారు కొనుగోళ్లు వాయిదా వేసుకోవాలని పిలుపునిచ్చిన మరుసటి రోజే దిగ్గజ జువెల్లర్స్ సం స్థల గోల్డ్ షేర్స్ 10శాతం వరకు పడిపోయాయి. ఇంధన వనరుల వినియోగం తగ్గించుకోవాలని సూచించడం కూడా వాహనదారుల్లో ఆందోళన రేపింది.

దేశంలో ఇంధన కొరత ఉండటంతోనే ప్రధాని ఆ వ్యాఖ్యలు చేశారనే భావన నెలకొంది. దీంతో కేంద్ర ప్రభుత్వం సోమవారం దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని, చాలినంత ఇంధన నిల్వలు ఉన్నాయని ప్రత్యేకంగా ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. అలాగే, భారతీయులు విదేశీ ప్రయాణాలను ఏడాది వరకు వాయిదా వేసుకోవాలని, వంటల్లో నూనెల వాడకం తగ్గించుకోవాలని, ఇంధన వినియోగం తగ్గించుకునేందుకు, ఉద్యోగులు అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోం పద్ధతి పాటించాలని ప్రధా ని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నా యి.

పశ్చిమాసియా యుద్ధ ప్రభావాలు భారత్‌పైనా ఉంటాయని, వాటిని తట్టుకునేందుకు ప్రజలు సిద్ధం కావాలని ప్రధాని పిలుపునిచ్చారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. ప్రధాని మోదీది విదేశీ మారక ద్ర వ్యాన్ని ఆదా చేసేందుకు చమురు వినియోగం తగ్గించే వ్యూహమని పేర్కొంటు న్నాయి. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రధా ని వ్యాఖ్యలు దివాలా కోరుతనానికి నిదర్శనమని పేర్కొంటున్నది. దీనిలో భాగంగానే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం మోదీ వ్యాఖ్యలపై విమర్శనాస్త్రాలు సంధించారు.‘

ఎవరు ఏం కొనాలి, ఏం కొనద్దు, ఒకవేళ కొంటే ఎక్కడికి వెళ్లి కొనాలి’ అని ప్రజలకు ప్రధాని చెపాల్సిన అగత్యం రావడం దారుణమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని జవాబుదారీతనం నుంచి తప్పించేందుకే మోదీ చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజలపైకి బాధ్యతలు నెడుతున్నారని ఆరోపించారు. మరోవైపు, మోదీ వర్క్‌ఫ్రం హోం పిలుపుపై జాతీయ ఐటీ పరిశ్రమల సంఘం ‘నాస్కా మ్’ స్పందించింది.

ప్రస్తుతం ఐటీ రంగంలో సమర్థంగా హైబ్రిడ్ పని విధానం అమలవుందని పేర్కొంది. క్లయింట్ అవసరాలను బట్టి ఏ ఉద్యోగిని కార్యాలయానికి పిలవాలి? ఎవరికి వర్క్ ఫ్రం హోం ఇవ్వాలనేది కంపెనీలు నిర్ణయిస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. అలాగే, పని ప్రదేశాల్లో విద్యుత్ వినియోగం తగ్గించేందుకూ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపింది. 

నగల సంస్థల షేర్లు డౌన్ 

ఏడాది వరకు వినియోగదారులు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునివ్వడం దేశీయ స్టాక్ మార్కెట్ పరిధిలోని గోల్డ్ షేర్లపై ప్రభావం చూపింది. ప్రధాని వ్యాఖ్యలతో డిమాండ్ తగ్గుతుందనే ఆందోళనతో ఇన్వెస్టర్లు సోమవారం నగల షేర్లను భారీగా విక్రయించారు. బీఎస్‌ఈలో సెన్కో గోల్డ్ షేర్ రూ.333 వద్ద, టైటాన్ షేర్ రూ.4,222 వద్ద ట్రేడ్ అయ్యాయి. కల్యాణ్ జువెలర్స్ షేర్ రూ.389కు పడిపోయింది.

అలా.. ఒక్కరోజే సుమారు రూ.35,000 కోట్ల సంపద ఆవిరైంది. టైటాన్ జువెలర్స్ షేర్లు ౭ శాతం, కల్యాణ్ జువెలర్స్ షేర్లు 9 శాతం పడిపోయాయి. సెన్కో గోల్డ్, పీఎన్ గాడ్గిల్ కంపెనీలు 8 శాతం వరకు నష్టాలను మూటగట్టుకున్నాయి. మొత్తంగా దిగ్గజ జువెలర్ సంస్థల షేర్లు సగటున 10 శాతం వరకు పడిపోయాయి. ప్రస్తుత పరిస్థితులపై చర్చించేం దుకు నగల వ్యాపార సంఘాల ప్రతినిధులు మంగళవారం ప్రధాని కార్యాలయా(పీఎంవో)నికి వెళ్లనున్నారు. 

ఇంధన కొరత లేదు: కేంద్రం 

దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరాకు ఎలాంటి కొరత లేదని కేం ద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంధ నం పొదుపు చేయాలని ప్రధాని మో దీ పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. దీంతో సోమవారం పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ ఓ ప్రకటన విడుదల చేశారు. దేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తత లు ఉన్నప్పటికీ ఇంధన సరఫరాకు ఆటంకం కలగకుండా ముందస్తు చర్య లు తీసుకుంటున్నామని వివరించారు.

వాహనదారులెవరూ ఆందో ళన చెందాల్సిన అవసరం లేదని, ఎవరూ కంగారు పడి అదనంగా ఇంధన నిల్వ చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే, దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత కూడా లేదని స్పష్టం చేశారు. గడిచిన మూడు రోజుల్లోనే 1.26 కోట్ల గ్యాస్ సిలిండర్లను వినియోగదారులకు అందజేమని వెల్ల డించారు. మార్కెట్‌లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయని వివరించారు.

ప్రధానివి హితబోధలు కాదు.. వైఫల్యాలు : ఏఐసీసీ అగ్రనేత రాహుల్

ప్రధాని నరేంద్ర మోదీ వల్లె వేసిన పొదుపు మంత్రాలు హితబోధలు కావని, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనాలని ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ విమర్శించారు. పన్నెండేళ్ల బీజేపీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ అధ్వాన స్థితికి వచ్చిందని దుయ్యబట్టారు. సోమవారం ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘ఎవరు ఏం కొనాలి, ఏం కొనద్దు, ఒకవేళ కొంటే ఎక్కడికి వెళ్లి కొనాలి’ అని ప్రజలకు ప్రధాని చెపాల్సిన అగత్యం రావడం దారుణమని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వాన్ని జవాబుదారీతనం నుంచి తప్పించేందుకే మోదీ చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజలపైకి బాధ్యతలు నెడుతున్నారని ఆరోపించారు. కేంద్రం చేతగానితనానికి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం అనైతికమంటూ నిప్పులు చెరిగారు. దేశాన్ని నడపడం ప్రధాని వల్ల కావడం లేదని ఎద్దేవా చేశారు. బాధ్యతల నుంచి తప్పుకోవడమే బీజేపీ అసలైన స్వరూపమని ధ్వజమెత్తారు. ఇంధన భద్రత విషయంలోనూ కేంద్రం వద్ద సరైన ప్రణాళిక లేదని మండిపడ్డారు.