10 August, 2026 | 8:35 PM

లోకకళ్యాణార్థం బీరంగూడలో ఘనంగా శతరుద్రాభిషేకం

10-08-2026 07:21 PM

108 మంది అర్చకులు, వేద పండితులతో మహాన్యాస పూర్వక  అభిషేకం

పాల్గొన్న ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ దంపతులు

అమీన్ పూర్: లోకకళ్యాణం, సకాలంలో వర్షాలు కురవాలని, రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం బీరంగూడ గుట్టలోని శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవాలయంలో మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేక కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ వీరశైవ జంగమ అర్చక పురోహిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో 108 మంది అర్చకులు, వేద పండితులు పాల్గొని స్వామివారికి మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేకం నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించడంతో ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్ యాదవ్ దంపతులు, కార్యనిర్వహణాధికారి దేవనాదం, ప్రధాన అర్చకులు ప్రహ్లాద, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లోకక్షేమం, సకాలంలో వర్షాలు కురవడం, పాడిపంటలు సమృద్ధిగా పండడం, ప్రజల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాల కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం నందీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించినట్లు చైర్మన్ సుధాకర్ యాదవ్ తెలిపారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.