28 May, 2026 | 2:33 AM

సురవరం జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో శతావధానం

28-05-2026 01:21 AM

హాజరైన మాజీ ప్రభుత్వ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.వి.రమణాచారి

ముషీరాబాద్, మే 27 (విజయక్రాంతి): తెలంగాణ వైతాళికులలో ఒకరైన సురవరం ప్రతాపరెడ్డి130వ జయంతి సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు భాషా చైతన్య సమితి, గోల్కొండ సాహితీ కళా సమితి, విశ్వభారతి మ్యాక్ సొసైటీ లిమిటెడ్, నక్క వెంకటమ్మ యాదవ్, నక్క యాదగిరి స్వామి యాదవ్ ఎడ్యుకేషనల్ అండ్ స్పోరట్స్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం రవీంద్రభారతిలో డాక్టర్ మలుగ అంజయ్య శతావధాని రెండు రోజుల శతావధానం ప్రారంభ సభ అర్థ చంద్రప్రకాష్ అధ్యక్షతన జరిగింది.

ముఖ్య అతిథిగా మాజీ ప్రభుత్వ సలహాదారు, విశ్రాంత ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి, విశిష్ట అతిథి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నందిని సిధారెడ్డిలు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కేవీ రమణాచారి  మాట్లాడుతూ తెలంగాణ వైతాళికుడు సురవరం  ప్రతాపరెడ్డి పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టడం ఎంతో సంతోషదాయకమన్నారు. అదే విధంగా వారి పేరు మీద ఈ విధంగా వివిధ కార్యక్రమాల జరగడం దాంట్లో ప్రాచీన కాలం నుంచి పరంపరగా అవధాన ప్రక్రియ వస్తుందన్నారు.

సురవరం జయంతిని పురస్కరించుకొని శతావదానాన్ని పెట్టడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. ప్రముఖ కవి నందిని సిధారెడ్డి మాట్లాడుతూ కాలం ప్రతి ఒక్కరి మీద ఒక బాధ్యతను మోపుతుందని,  సురవరం ప్రతాపరెడ్డి పైన అంధకారంలో ఉన్న తెలంగాణను పట్టి లేపమని అనేక విధాలైనటువంటి కార్యక్రమాలు చేయమని నిర్ణయించిందన్నారు. ఆయన ఆ పనిని భారంగా కాక బాధ్యతగా నిర్వహించి తెలంగాణ వైతాళికునిగా చరిత్రలో నిలిచాడన్నారు. 

ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక  శాఖ సంచాలకులు ఏనుగు నరసింహా రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఎన్. బాలాచారి, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, డాక్టర్ సురవరం కృష్ణవర్ధన్ రెడ్డి, తెలుగు భాష చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బడేసాబ్, ఆచార్య జయరాములు, రామకృష్ణ చంద్రమౌళి నక్క శ్రీనివాస్ యాదవ్, డాక్టర్ ఎడ్ల కల్లేష్, ఎల్, జగన్, మండల గురునాథం, కే. సత్యనారాయణ, ఆవ మల్లయ్య, టి. సురేష్, ఎస్. నరేందర్ ఉభయ రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ పద్య కవులు పృచ్చకులుగా పాల్గొన్ని మూడు అవృత్యాలను పూర్తి చేశారు.

గురువారం రవీంద్రభారతిలో జరిగే ముగింపు సభకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,  ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి. చిన్నారెడ్డి  పాల్గొంటారని, మరో ఐదు ఆవృత్తాలతో శతావధానం  ముగింపు సభ ఉంటుందని కార్యక్రమ నిర్వాహకులు  తెలియజేశారు.