01-11-2025 12:00:00 AM
-జెమీమాపై ఆసీస్ మీడియా ప్రశంసలు
-గొప్ప విజయమంటూ కోహ్లీ ట్వీట్
నవీ ముంబై, అక్టోబర్ 31: క్రికెట్‌లో భారత్ ఆధిపత్యంపై అక్కసు చూపించే ఆస్ట్రేలియా మీడియా తొలిసారి మన క్రికెటర్‌ను పొగుడుతూ ఆకాశానికెత్తేసింది. అది కూడా సెమీఫైనల్లో తమ జట్టు ఓటమికి కారణమైన భారత యువ క్రికెటర్ జెమీమా రోడ్రి గ్స్‌ను ప్రశంసిస్తూ కథనాలు రాసింది. గురువారం అద్భుతమైన సెంచరీతో ఏకంగా 339 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేయడంలో కీలకపాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్ పేరు ఇప్పుడు వరల్డ్ క్రికెట్‌లో మారుమోగిపోతోంది.
కీలకమైన నాకౌట్ మ్యాచ్‌లో ఎంతో ఒత్తిడిని తట్టుకుని ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను గెలిపించడంతో ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎప్పుడూ భారత్ విజయాలను తక్కువగా చూసే ఆస్ట్రేలియా మీడియా సైతం జెమీమా వీరోచిత సెంచరీకి ఫిదా అయింది. తమ జట్టును విమర్శిస్తూ, జెమీమాను పొగుడుతూ అక్కడి ప్రధాన పత్రికలన్నీ కథనాలు రాసాయి. లైఫ్ టైమ్ గుర్తిండిపోయే ఇన్నింగ్స్ ఆడిందంటూ కితాబిచ్చాయి. అదే సమయంలో ఆసీస్ కెప్టె న్ అలీసా హీలీ క్యాచ్‌లు జారవిడిచి మ్యాచ్ ఓటమికి కారమమైందంటూ విమర్శలు గుప్పించాయి.
సాధారణంగా వికెట్ల వెనుక చాలా చురుగ్గా ఉండే హీలీ సెమీస్‌లో జెమీ మా ఇచ్చిన క్యాచ్‌ను వదిలేసింది. ఫలితంగా ఆమె సెంచరీ చేయడం, ఆసీస్ ఇంటిదారి పట్టడం జరిగాయి. దీంతో తమ జట్టు చెత్త ఫీల్డింగ్‌తోనే ఓడిపోయిందంటూ ఆసీస్ మీడియా విమర్శించింది. ఇదిలా ఉంటే జెమీమా రోడ్రిగ్స్‌ను ప్రశంసిస్తూ భారత స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఆమె ఒక అద్భుతం అంటూ కితాబిచ్చాడు. ఆస్ట్రేలియాపై జెమీమా అద్భుతంగా ఆడిందని, జట్టు పట్టుదలగా ఈ విజయం గొప్ప నిదర్శనమని ప్రశంసిస్తూ పోస్ట్ చేశాడు.