పర్సంటేజీ అంశంపై చిరంజీవిని కలిశాం
హైదరాబాద్: సింగిల్ స్క్రీన్స్ కి ప్రస్తుతం నెలకొన్న సమస్యపై తెలుగు సినీ పరిశ్రమ నిర్మాతాలు, ఎగ్జిబిటర్లు సోమవారం మెగాస్టార్ చిరంజీవితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు, టీఎఫ్సీసీ ప్రెసిడెంట్ సురేశ్‌బాబు, నిర్మాతలు కేఎల్ నారాయణ, అల్లు అరవింద్, తెలంగాణ ఛాంబర్ ఎగ్జిబిటర్లు తదితరులు ఉన్నారు. పర్సంటేజీ వివాదంపై ఇరువురితో గంటపాటు చర్చించారు.
విషయాలన్నీ పూర్తిగా విన్న చిరంజీవి పరిశ్రమలో భాగస్వాములైన అందరికీ పూర్తి న్యాయం జరిగేలా వుండాలని, ఒక్క సినిమా గురించో, ఒక్క సెక్టార్ గురించో ఈ చర్చ కాదని, అందరికీ ఆమోదయోగ్యంగా వుండాలనే పరిశ్రమ కొన్ని పద్దతులను ఏర్పరుచుకుందన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకి హైయెస్ట్ బాడీ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్న విషయాన్ని గుర్తు చేసి, ఆ ఛాంబర్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వుండటం అందరికీ సముచితమని చిరంజీవి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ... పర్సంటేజీ అంశంపై చిరంజీవి కలిశామని, ఎగ్జిబిటర్ల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారని పేర్కొన్నారు. పర్సంటేజీ విధానంపై ఛాంబర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైందని, వారం కిందట ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీ నుంచి మరిన్ని వివరాలు తెప్పించుకుని పరిశీలిస్తానన్నారు. సమస్యని కమిటీకి అప్పగించి కమిటీ ద్వారా రెండు రోజుల్లో పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. అందుకు సంబంధించిన వివరాలను ఛాంబర్ అధికారికంగా ప్రకటిస్తుందని, దీంతో ప్రస్తుతం ఎగ్జిబిటర్స్ అందరూ సంతోషంగా ఉన్నారని దిల్ రాజు పేర్కొన్నారు.






