ఆమె ఐఐటీ.. అతను ఐపీఎస్!
- సీవీ ఆనంద్ దంపతుల అద్భుత ప్రయాణం!
- 21 ఏళ్లకే సివిల్స్ సాధించిన సీవీ ఆనంద్
- 40 ఏళ్లకు ఐఐటీ పీహెచ్‌డీ పట్టా పొందిన లలితా ఆనంద్
హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): సివిల్ సర్వీస్‌లో టాప్ ర్యాంకు సాధించాలని లేదా ఐఐటీలో చదవాలని చాలామంది కలలు కంటారు. కానీ రెండూ సాధించిన జంట హైదరాబాద్‌లోనే ఉంది. వారు తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్, ఆయన భార్య లలితా ఆనంద్. సీవీ ఆనంద్ డీజీపీగా ఉన్నత శిఖరాలకు చేరుకోగా.. ఆయన భార్య లలితా ఆనంద్ ఐఐటీ పీహెచ్‌డీ, ఐఎస్బీ ప్రొఫెసర్‌గా ఎదిగి.. 57 ఏళ్ల వయసులో భరతనాట్యం అరంగేట్రం చేసి యువతలో స్ఫూర్తి నింపుతున్నారు.
1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్.. మొదటి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో 147 ర్యాంకు సాధించి 21 ఏళ్ల వయసులోనే ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. సొంత రాష్ట్రం (ఉమ్మడి ఏపీ) కేడర్‌కు రావడం మరో విశేషం. 2013 నుంచి 2016 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. 2017లో అదనపు డీజీపీగా పదోన్నతి పొందారు. 2021 డిసెంబర్ 24న హైదరాబాద్ ఐజీ కమిషనర్‌గా నియమితులైన సీవీ ఆనంద్ 2023 ఆగస్టు 7న డీజీగా పదోన్నతి పొందారు.
2024 సెప్టెంబర్ 7న రెండోసారి హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2025 సెప్టెంబర్ 27 నుంచి హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఆయన 2028 జూన్ వరకు డీజీపీగా కొనసాగనున్నారు.
లలితా ఆనంద్ త్యాగం..
భర్తకు తగ్గ భార్యగా లలితా ఆనంద్ తనదైన మార్కు చూపారు. భర్త కెరీర్, పిల్లల పెంపకం కోసం చదువును మధ్యలో ఆపేశారు. 40 ఏళ్ల వయసులో మళ్లీ పుస్తకాలు చేతపట్టి ఐఐటీ మద్రాస్‌లో పీహెచ్‌డీ (మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/కార్పొరేట్ ఫైనాన్స్) పూర్తి చేశారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ రీసెర్చర్‌గా చేరి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారు. చిన్నప్పటి నుంచి సాంప్రదాయ నృత్యాలంటే ఇష్టం. కానీ చదువు, -కుటుంబం కోసం ఆపేశారు. 50 ఏళ్లు పైబడిన వయసులో మళ్లీ నాట్యం వైపు మనసు మళ్లించి 57 ఏళ్ల వయసులో భరతనాట్యం అరంగేట్రం ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఆదర్శ దంపతులు..
సీవీ ఆనంద్ ఆనంద్ ఆదర్శ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు చామ మిలింద్ హైదరాబాద్ క్రికెట్ జట్టుకు చెందిన ప్రొఫెషనల్ క్రికెటర్. ఇండియా అండర్ ఆర్సీబీ (ఐపీఎల్)లో కూడా ఆడారు. సీవీ ఆనంద్ ఇప్పటికీ క్రికెట్, టెన్నీస్ ఆడుతూ ఫిట్‌గా ఉంటూ యువతకు ఆదర్శంగా ఉంటున్నారు. లలితా డయాబెటిస్‌ను రివర్స్ చేసుకుని ఫిట్‌నెస్‌పై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. వయసు, పరిస్థితులు ఏమైనా కమిట్మెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చునని వీరు నిరూపించారు. భర్త పోలీస్‌గా ప్రజా సేవలో.. భార్య అకాడెమిక్స్ అండ్ ఆర్ట్స్‌లో తమదైన మార్కు చూపి.. పిల్లలను కూడా స్ఫూర్తి కేంద్రంగా మార్చారు.
క్రికెట్ నుంచి ఐపీఎస్ వరకు..
సీవీ ఆనంద్ పక్కా తెలంగాణ బిడ్డ. రంగారెడ్డి జిల్లాలో జన్మించారు. చిన్నప్పుడే కుటుంబం హైదరాబాద్‌కు వచ్చింది. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో సీవీ ఆనంద్ చదివారు. చదువులో మెరుగు.. క్రికెట్‌పై మంచి పట్టు. నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతూ హైదరాబాద్ క్రికెట్ టీమ్ తరఫున ఆడారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ (ఎకనామిక్స్)లో గోల్డ్ మెడల్ సాధించారు. ఇండియా అండర్‌జ క్రికెట్ జట్టులో చోటు దక్కించుకుని ఇంగ్లాండ్ పర్యటన కూడా చేశారు. కానీ ఒక దశలో క్రికెట్ వర్సెస్ చదువు మధ్య సందేహం వచ్చింది. చదువునే ఎంచుకున్నారు.






